నిండు ప్రాణాన్ని కాపాడిన కోహ్లి దంపతులు

 టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఓ రెండేళ్ల చిన్నారి వైద్యానికి అవసరమయ్యే రూ.16 కోట్లు విలువ చేసే  ఖరీదైన మందు కోసం నిధులు సమకూర్చారు. ఇప్పటికే కరోనా బాధితుల కోసం రూ. 2 కోట్ల విరాళం ప్రకటించిన విరుష్క దంపతులు.. తాజాగా ఆయాన్ష్ గుప్తా అనే ఓ చిన్నారికి పరోక్షంగా ప్రాణదాతలుగా నిలిచి మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఆయాన్ష్ గుప్తా.. వెన్నెముక కండరాలకు సంబంధించిన  అరుదైన జెనెటిక్ వ్యాధితో బాధపడుతున్నాడు.

ఈ వ్యాధి నుంచి కోలుకునేందుకు అతనికి  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్గెన్స్‌మా అనే మందు అవసరమైంది. ఇంత ఖరీదైన మందును కొనే స్తోమత లేని  చిన్నారి తల్లిదండ్రులు నిధుల కోసం ట్విటర్ వేదికగా ‘AyaanshFightsSMA’పేరుతో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని  చేపట్టారు. ఇందుకు కోహ్లి దంపతులు తమ వంతు సహాయం చేయడంతో పాటు తమ అభిమానులను కూడా ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కాగా, ఆ చిన్నారి వైద్యానికి అవసరమయ్యే రూ.16 కోట్లు సోమవారం(మే 23) నాటికి సమకూరాయని చిన్నారి తల్లిదండ్రులు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు విరాళాలు అందించిన వారితో పాటు కోహ్లి దంపతులకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అయాన్ష్ కోసం కోహ్లి దంపతులు తాము ఊహించనిదాని కంటే ఎక్కువ చేశారని, ఇన్ని రోజులు వారిని  అభిమానించే వాళ్లమని, కానీ ఇప్పటి నుంచి ఆ గొప్ప దంపతులను  ఆరాధిస్తామని ఆకాశానికెత్తారు.

మా జీవితంలోనే కఠినమైన మ్యాచ్‌లో కోహ్లీ మమ్మల్ని సిక్స్‌తో గెలిపించారని కొనియాడారు. అయితే కోహ్లి దంపతులు ఎంత సాయం చేశారన్నది మాత్రం చిన్నారి తల్లిదండ్రులు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే, కోహ్లి  ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. ఈ పర్యటనలో భారత్..  న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.