కుటుంబ సమేతంగా ఇంగ్లండ్‌ పర్యటన

భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు కుటుంబ సమేతంగా ఇంగ్లండ్‌ పర్యటనకు వచ్చేందుకు యూకే ప్రభుత్వం సమ్మతి తెలిపింది. తమ దేశంలో సుదీర్ఘ ప‌ర్యట‌న‌ నిమిత్తం రానున్న రెండు జట్ల ప్లేయ‌ర్స్.. తమ త‌మ ఫ్యామిలీస్‌తో క‌లిసి ఉండేందుకు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌(ఈసీబీ) ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ పర్యటనలో భాగంగా భారత పురుషుల జట్టు ఏకంగా నాలుగున్నర నెలలు యూకేలోనే గడపనుండగా, మహిళా జట్టు కూడా దాదాపు నెలన్నర రోజులు అ‍క్కడే స్టే చేయనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌తో పాటు రూట్‌ సేనతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొనేందుకు భారత పురుషుల జట్టు, ఇంగ్లండ్ వుమెన్స్‌ టీమ్‌తో ఒక టెస్ట్‌, మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత మహిళా జట్లు ఈ నెల 2న ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరనున్నాయి.

లండన్‌లో ల్యాండ్‌ అయ్యాక ఇండియా మెన్స్‌ టీమ్‌.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ వేదికైన సౌథాంప్టన్‌కు వెళ్లనుండ‌గా.. భారత మహిళల జట్టు ఏకైక టెస్ట్‌కు వేదికైన బ్రిస్టల్‌కు బయల్దేరుతుంది. అయితే, యూకేలో ల్యాండ్‌ అయ్యాక భారత బృందం 10 రోజుల పాటు త‌ప్పనిస‌రి క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

అనంతరం ప్లేయర్స్‌తో పాటు వారి కుటుంబ స‌భ్యుల నెగ‌టివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టును క‌చ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. కాగా, లండన్‌కు బయల్దేరనున్న భారత బృందం ఇప్పటికే ముంబైలోని ఒకే హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంటుంది. భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి కారణంగా ఇండియా నుంచి ప్రయాణాల‌పై నిషేధం ఉన్నా.. క్రికెట్ మ్యాచ్‌ల కోసం యూకే ప్రభుత్వం ప్లేయ‌ర్స్‌కు స‌డ‌లింపులు ఇచ్చిన‌ట్లు ఐసీసీ వెల్లడించింది.