ఒక్కసారిగా హైలైట్‌ అయిన హర్‌ప్రీత్‌ బ్రార్‌

హర్‌ప్రీత్‌ బ్రార్‌.. పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. ఆర్సీబీతో ఆడిన మ్యాచ్‌ అతనికి ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మొదటిది. అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోయే బ్రార్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌ ద్వారా ఒక్కసారిగా హైలైట్‌ అయ్యాడు. కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌ వంటి స్టార్‌ ఆటగాళ్ల వికెట్లను సాధించి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. కాగా, కోహ్లి, మ్యాక్సీలను వరుస బంతుల్లో ఔట్‌ చేయడంతో ఆర్సీబీ తేరుకోలేకపోయింది. అయితే బ్రార్‌ సంచలన ప్రదర్శన ద్వారా అతను గతవారం చేసిన ట్వీట్‌ మళ్లీ వైరల్‌ అయ్యింది.

బాలీవుడ్ హీరో‌ అక్షయ్ కుమార్‌పై ఈ పంజాబ్ బౌలర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. హర్‌ప్రీత్ బ్రార్‌ను చూసి ఓ నెటిజన్.. ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ సినిమాలోని అక్షయ్ కుమార్‌లానే ఉన్నావని ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశాడు. ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సిక్కు కుర్రాడి పాత్ర పోషించాడు. వారిలానే టర్బన్ (తలపాగ) ధరించాడు. అయితే అభిమాని కామెంట్‌కు చిర్రుత్తుకుపోయిన హర్‌ప్రీత్ బ్రార్.. ఆ కామెంట్‌ స్క్రీన్ షాట్ చేస్తూ తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. తాను డబ్బుల కోసం టర్బన్ ధరించననే ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశాడు. అంతేకాకుండా రైతు ఉద్యమానికి నా మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. రైతు ఉద్యమానికి అక్షయ్‌ కుమార్‌ మద్దతు ఇవ్వకపోవడమే హర్‌ప్రీత్‌ బ్రార్‌ ఘాటు ట్వీట్‌కు ప్రధాన కారణం.