రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన గేల్‌

‘యూనివర్సల్‌ బాస్‌’ వెస్టిండీస్‌ డాషింగ్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ టి20 జట్టులోకి వచ్చాడు. మార్చి 3, 5, 7 తేదీల్లో శ్రీలంక జట్టుతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే వెస్టిండీస్‌ జట్టును ప్రకటించారు. కీరన్‌ పొలార్డ్‌ సారథ్యంలోని 14 మంది సభ్యులతో కూడిన జట్టులో 41 ఏళ్ల గేల్‌కు, 39 ఏళ్ల పేసర్‌ ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌లకు చోటు లభించింది.

ఇటీవల జరిగిన ఐపీఎల్, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ టి20 టోర్నీలలో గేల్‌ నిలకడగా రాణించడంతో అతడిని ఎంపిక చేశామని విండీస్‌ బోర్డు సెలెక్టర్‌ రోజర్‌ హార్పర్‌ తెలిపాడు. గేల్‌ తన చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ను 2019 మార్చి 8న భారత జట్టుపై ఆడాడు. ఓవరాల్‌గా టి20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా గేల్‌ గుర్తింపు పొందాడు. గేల్‌ ఇప్పటివరకు 413 టి20 మ్యాచ్‌లు ఆడి 22 సెంచరీలు, 86 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 13,691 పరుగులు సాధించాడు.