చెన్నైలో అడుగుపెట్టిన ధోని

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ట్రైనింగ్ క్యాంప్ మార్చి 11 నుంచి చెపాక్ స్టేడియంలో ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఈ క్యాంపు మొదటి రోజు నుంచే కెప్టెన్ ఎంఎస్‌ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ధోనీ బుధవారం చెన్నై చేరుకున్నాడు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తుండగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ధోనికి స్వాగతం పలుకుతూ.. ”సీఎస్‌కే టీమ్‌ వెల్‌కమ్‌ టూ చెన్నై తలైవా..” అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ధోనితో పాటు ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టాడు. బయో సెక్యూర్‌ వాతావరణంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ క్యాంప్ నిర్వహించనున్నారు. మిగతా ఫ్రాంఛైజీలకన్నా ముందే చెన్నై ట్రైనింగ్‌ క్యాంప్‌ను నిర్వహించబోతున్నది. కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అంతగా ఆకట్టుకోలేదు. లీగ్‌ ప్రారంభంలో వరుసగా మ్యాచ్‌లు ఓడిపోయి ఒక దశలో పాయింట్లక పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే లీగ్‌ చివర్లో మళ్లీ ఫుంజుకున్న చెన్నై వరుస విజయకాలు నమోదు చేసి ఏడో స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌ మొదటి వారంలో ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం.