టీమిండియా ఆటగాడు జయదేవ్ వివాహం

టీమిండియా ఆటగాడు జయదేవ్ ఉనద్కట్ ఓ ఇంటి వాడయ్యాడు. రినీ కంటారియా అనే యువతిని అతడు పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో మంగళవారం వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని జయదేవ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు.

సంప్రదాయ వస్త్రధారణలో భార్యతో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా షేర్‌ చేశాడు. దీంతో కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. కాగా సౌరాష్ట్ర పేసర్‌ అయిన జయదేవ్‌ ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

కాగా 2010లో సంప్రదాయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉనద్కట్‌, 2013లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2016లో టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ఇక 2018లో రాజస్తాన్‌ జట్టు అతడిని రూ .11.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అదే జట్టు మళ్లీ రూ. 8.5 కోట్లకు దక్కించుకుంది.

అదే విధంగా 2020లో వేలంలోకి రాగా మళ్లీ అదే జట్టు రూ. 3 కోట్లకు దక్కించుకుంది. కానీ ఉనద్కట్‌ ఆశించిన మేర రాణించకపోవడంతో అంత భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన ఆటగాడితో రాజస్తాన్‌కు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందంటూ మాజీ దిగ్గజ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తదితరులు అతడిపై విమర్శల వర్షం కురిపించారు.