క్లారిటీ ఇచ్చిన కెప్టెన్‌ విరాట్‌

ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించిన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా..టెస్టు సిరీస్‌కు ఎంపిక కాని సంగతి తెలిసిందే. హార్దిక్‌కు టెస్టు జట్టుతో ఉండాలనే కోరిక ఉన్నా ఎంపిక కాని కారణంగా స్వదేశానికి బయల్దేరక తప్పలేదు. అసలు హార్దిక్‌ లాంటి ఆల్‌రౌండర్‌ని టీమిండియా టెస్టు జట్టులో ఎందుకు చోటు కల్పించలేదనే దానిపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. ఇంకా పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా ఫిట్‌ కాలేకపోవడమే హార్దిక్‌ను టెస్టు జట్టులో ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణమన్నాడు. ఒకవేళ అతన్ని టెస్టు జట్టులో ఎంపిక చేసి ఉంటే బౌలింగ్‌ కూడా చేయాల్సి ఉంటుందని, బ్యాట్స్‌మన్‌గా మాత్రమే హార్దిక్‌ను టెస్టు జట్టులోకి పరిగణించలేమన్నాడు.

‘టెస్టు క్రికెట్‌ అనేది ఒక భిన్నమైన గేమ్‌. కానీ అతను ఇప్పుడున్న పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయలేడు. ఆ విషయం మాకు కూడా తెలుసు. ఒకవేళ ఎంపిక చేస్తే బౌలర్‌ కూడా హార్దిక్‌ బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే అతన్ని పరిగణించలేకపోయాం. హార్దిక్‌ కనుక టెస్టు జట్టులో ఉండి ఉంటే జట్టులో మరింత సమతుల్యం వచ్చేది. హార్దిక్‌ బౌలింగ్‌కు ఇంకా ఫిట్‌ కాలేకపోవడం వల్లే తనకు తానుగా స్వదేశానికి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నాడు. పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా సన్నద్ధ కావడానికి కూడా విశ్రాంతి అవసరమనే హార్దిక్‌ భావించాడు’ అని కోహ్లి తెలిపాడు.

గతేడాది వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న హార్దిక్‌ సుదీర్ఘ కాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఈ ఏడాది ఒక దేశవాళీ ట్రోఫీలో ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న హార్దిక్‌ మళ్లీ టీమిండియా జట్టులో స్థానం సంపాదించాడు. ఇక ఈ సీజన్‌ ఐపీఎల్‌లో కూడా హార్దిక్‌ బ్యాటింగ్‌లో విశేషంగా రాణించాడు. కానీ ఐపీఎల్‌ టోర్నీ అంతా కూడా బౌలింగ్‌కు దూరంగానే ఉన్నాడు. కాగా, గతంలోనే తాను ఏదొక ఫార్మాట్‌కు పరిమితం కావాలనుకుంటున్నట్లు హార్దిక్‌ స్పష్టం చేశాడు. భవిష్యత్తులో టెస్టులో ఆడటం అనేది అనుమానమనే సంకేతాలు ఇచ్చాడు హార్దిక్‌. టెస్టు మ్యాచ్‌లు ఆడితే ఆ గాయం మరొకసారి తిరగబెట్టే అవకాశం ఉండటంతో హార్దిక్‌ క్రికెట్‌ను ‘పరిమితంగా’ ఆడాలనుకుంటున్నాడు. ఆ క్రమంలోనే టెస్టులకు హార్దిక్‌ అంతగా మక్కువ చూపడం లేదు.