మెస్సీ ఒప్పందం విలువ

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు స్టార్‌ ప్లేయర్, బార్సిలోనా క్లబ్‌ ఆటగాడు లయనెల్‌ మెస్సీ ఒప్పందం విలువ ఎంతో బయటపడింది. అతను ఈ ప్రపంచంలోనే అతి ఖరీదైన ప్లేయర్‌ అని తేలిపోయింది. ఎవరి ఊహకందని మొత్తం అతను అందుకుంటున్నట్లు స్పెయిన్‌కు చెందిన ఎల్‌ మండో పత్రిక కథనాన్ని ప్రచురించింది. బార్సిలోనా క్లబ్‌తో అతను నాలుగు సీజన్లు ఆడేందుకు 55 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 4,906 కోట్లు) మొత్తం అందుకుంటున్నాడు.

ఈ డీల్‌కు సంబంధించిన సమాచారం (డాక్యుమెంట్‌) లభించడంతో ఈ పత్రిక మెస్సీకి ఏడాదికెంత మొత్తం లభిస్తోంది, అతను ఎంత మొత్తంలో పన్నులు కడుతున్నాడో కూడా వెల్లడించింది. 2017లో కుదిరిన ఈ భారీ ఒప్పందంలో సీజన్‌కు 13 కోట్ల 80 లక్షల యూరోలు (రూ.1,217 కోట్లు) చొప్పున మెస్సీకి పారితోషికం లభిస్తుంది. ఇందులో ఫిక్స్‌డ్‌ సాలరీ (జీతం)తో పాటు ఇతరత్రా అలవెన్సులు అన్నీ కలిసే ఉంటాయని ఆ పత్రిక వివరించింది. దాదాపు రూ. ఐదు వేల కోట్ల ఒప్పంద విలువలో మెస్సీ సగం మొత్తాన్ని స్పెయిన్‌లో పన్నుల రూపేణా చెల్లిస్తున్నాడని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.

లయనెల్ మెస్సీ ఒప్పందం విలువ బహిర్గతం కావడంపై బార్సిలోనా క్లబ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్‌ మండో పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. మెస్సీ కూడా ఎల్‌ మండో పత్రికపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు స్థానిక వార్తాసంస్థల సమాచారం.