నా ఎంపికపట్ల ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ శుక్రవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 20 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టుకు అదనంగా నలుగురిని స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా ఎంపికచేశారు. వారిలో అర్జాన్‌ నాగ్వాస్‌వాలా ఒకడు. గుజరాత్‌కు చెందిన లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌. 16 మ్యాచ్‌లలో 22.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. 2019- –20 రంజీ సీజన్‌లో 41 వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న ఏకైక పార్సీ ఆటగాడు అతనే కావడం విశేషం. ఇక నాగ్వాస్‌వాలా తనను డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపికచేసిన విషయంపై ఒక ఇంటర్య్వూలో స్పందించాడు.

”నా ఎంపికపట్ల ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది.. నేను సెలెక్ట్‌ అయ్యానంటే నమ్మలేకపోతున్నా. ఇంగ్లండ్‌ పరిస్థితులకు నా బౌలింగ్‌ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నా. ఎప్పుడెప్పుడు ఇంగ్లండ్‌ వెళ్దామా అని ఎదురుచూస్తున్నా. అయితే ఇప్పటివరకు నేను టీమిండియా కెప్టెన్‌ను దూరం నుంచి చూశానే తప్ప ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాలేదు. ఇంగ్లండ్‌ పర్యటనతో నాకు కోహ్లిని కలిసే అవకాశం కలిగింది. దీంతో పాటు నా ఐపీఎల్‌ టీం కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు నా ఐకాన్‌ బౌలర్‌ జహీర్‌ఖాన్‌ను కలవడానికి కూడా ఉత్సుకతతో ఉన్నా. ఇక 2011 ప్రపంచకప్‌ నన్ను క్రికెట్‌ వైపు మళ్లించేలా చేసింది. ధోని సారధ్యంలో కప్‌ను గెలవడం.. అది భారత్‌లో 28 ఏళ్ల తర్వాత సాధించడం నా జీవితాన్ని క్రికెట్‌కే అంకితం చేయాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నా” అంటూ చెప్పుకొచ్చాడు.