హైదరాబాద్: ఇవాళ (శనివారం) సూర్యుడికి దగ్గరగా వెళ్లనుంది భూమి. ఏదాదిలో ఒకసారి మాత్రమే ఇలా సూర్యుడికి భూమి దగ్గరగా వెళ్తుంది. దీనిని పెరిహెలియన్ అంటారు. శనివారం సాయంత్రం 7.27 గంటలకు భూమి.. సూర్యుడికి 14,70,93,168 కిలోమీటర్ల దూరంలో ఉండనుంది. ఇది సూర్యుడికి భూమి ఉండే అత్యధిక దూరమైన 15,21,00,523 కిలోమీటర్ల కంటే 50,07,355 కిలోమీటర్లు తక్కువ కావడం విశేషం. దీనిని అఫెలియన్ అంటారు. జులై 6వ తేదీన సూర్యుడికి భూమి చాలా దూరంగా జరుగుతుంది.
మనం గుర్తించకపోయినా..
భూమి ఇలా సూర్యుడికి దగ్గరగా, దూరంగా జరిగిన ఘటనలను సాధారణంగా మనం గుర్తించలేమని ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ రఘునందర్ కుమార్ అన్నారు. అయితే ఈ పెరిహెలియన్, అఫెలియన్ వల్ల భూమిపై ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తాయన్నది మాత్రం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా భూమి.. సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రతలు, దూరంగా వెళ్లినప్పుడు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు అని రఘునందన్ అన్నారు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో తన కక్ష్యలో 23.5 డిగ్రీల వంపుతో తిరుగుతుందని, దీనివల్లే భూమిపై కాలాలు మారుతుంటాయని ఆయన చెప్పారు. చాలా దేశాల్లో జనవరిలో అందుకే చలికాలం ఉంటుందని, నిజానికి భూమి సూర్యుడికి దూరంగా ఉన్న సమయంలోనే ఇండియాలో ఎక్కువ వేడి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలని ఆయన చెప్పారు.