కరోనాతో ఎమ్మెల్సీ మృతి

వైసీపీ ఎమ్మెల్సీ , క‌ర్నూలు జిల్లా సీనియ‌ర్ నేత చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డిని క‌రోనా మ‌హ‌మ్మారి బ‌లి తీసుకుంది. గ‌త నెల 13న క‌రోనాతో హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చేరిన చ‌ల్లా చికిత్స పొందుతూ నేటి ఉద‌యం తుదిశ్వాస విడిచారు. క‌రోనాతో ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు మృత్యువాత ప‌డ్డారు. మ‌న రాష్ట్రంలో తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ క‌రోనాతో త‌నువు చాలించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి నుంచి అధికార పార్టీ కోలుకోకుండానే, మ‌రో ముఖ్య‌నేత‌, ఎమ్మెల్సీ చ‌ల్లా ప్రాణాలు కోల్పోవ‌డం …వైసీపీకి తీర‌ని లోట‌ని చెప్పొచ్చు.కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డిది కీల‌క‌పాత్ర‌.  అవుకు మండలం ఉప్పలపాడు చ‌ల్లా స్వ‌గ్రామం.  ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్ నుంచి ఓడిపోయారు. 1991లో నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలుపొందారు.2009లో బ‌న‌గాన‌ప‌ల్లె నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన చ‌ల్లా త‌న స‌మీప ప్ర‌త్యర్థి అయిన ప్ర‌జారాజ్యం అభ్య‌ర్థి కాట‌సాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఆయ‌న  టీడీపీలో చేరారు.  ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డి గెలుపులో ప్ర‌ధాన పాత్ర పోషించారు. టీడీపీ హ‌యాంలో ఆయ‌న ఏపీ సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి..  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌ సీపీ బనగానపల్లె అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అనంత‌రం ఆయ‌న్ను ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ చేసి వైసీపీ గౌర‌వించింది.చల్లా రామకృష్ణారెడ్డి మృతిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కర్నూలు జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,  త‌దిత‌ర నేత‌లు, కార్య‌క‌ర్త‌లు  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయ‌న‌ భౌతిక కాయాన్ని హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి తరలిస్తున్నారు. రేపు ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.