చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి మద్దతివ్వాలని సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కోరుతానని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తెలిపారు. ఒక వేళ రజినీ తమకు మద్దతిస్తే కార్యకర్తలకు మంచి ప్రోత్సహం ఇచ్చినట్లవుతుందన్నారు. రజినీ తనకు మంచి స్నేహితుడు అని పేర్కొన్నారు. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికలు నిజాయితీకి, అవినీతికి మధ్య జరిగేవి అని అన్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా రజినీకాంత్ పార్టీ ఏర్పాటును నిలిపిన వేసిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టకూడదన్న రజనీకాంత్ నిర్ణయం ఆయన అభిమానులలాగే తననూ తీవ్ర నిరాశకు గురి చేసిందని కమల్ హాసన్ గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. అయితే ఆయన ఆరోగ్యమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. తన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రజనీకాంత్‌ను కలుస్తానని కమల్ చెప్పారు. రజనీ పార్టీ పెడుతున్నారని ప్రకటించిన తర్వాత.. ఆయన పార్టీతో పొత్తుపై గతంలో కమల్ స్పందించారు. కేవలం ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోతుందని, తమ ఇద్దరి సిద్ధాంతాలు ఒకటే అయితే అహాలను పక్కన పెట్టి కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కమల్ అప్పట్లో స్పష్టం చేశారు.