నెల్లూరుకు జగన్.. మరి లుకలుకల సంగతేంటి?

సీఎం జగన్ వస్తున్నారంటే ప్రతిపక్షాలు హడావిడి పడాలి కానీ, అధికార పార్టీ నేతలు ఎందుకు టెన్షన్ పడతారని అనుకుంటున్నారా.. ? అన్ని చోట్లా కాదు, నెల్లూరులో మాత్రం జగన్ టూర్ అనగానే వైసీపీ నేతల్లో కంగారు మొదలైంది. ఇప్పటికే పలుమార్లు స్థానిక పంచాయితీ జగన్ వద్దకు వెళ్లింది. అప్పుడు వాటన్నిటినీ సున్నితంగా పక్కన పెట్టేసిన జగన్ ఈసారి మాత్రం ఒకరిద్దరికి ఘాటుగానే క్లాస్ పీకేలా ఉంది పరిస్థితి.తిరుపతి ఉప ఎన్నిక తరుముకొస్తోంది. నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి పరిధిలోకి వస్తాయి. సరిగ్గా ఇప్పుడు ఆ నాలుగు నియోజకవర్గాల్లోనే సమస్యలున్నాయి. అందుకే జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు పార్టీలో ఉన్న అంతర్గత విబేధాల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ మధ్య జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవం కోసం పెనమలూరు నియోజకవర్గంలో పునాదిపాడు స్కూల్ కు వెళ్లిన ఆయన.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ మధ్య విభేదాలు తగ్గించే ప్రయత్నం చేశారు. ఇద్దరి చేతుల్ని కలిపి ఒకటి చేశారు. అప్పటినుంచి లోపల ఎలా ఉన్నా, బైటకి మాత్రం ఇరు వర్గాలు స్నేహితం కొనసాగిస్తున్నాయి.ఇక నెల్లూరు విషయానికొస్తే.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు విభేదిస్తున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నేరుగా మంత్రి ఇలాకాలో గడప గడపకి వెళ్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన వెళ్తే నాకేం నష్టం, పార్టీ కోసం పాటుపడితే అందరికీ ఇష్టం అంటూ అనిల్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆనం వివేకా జయంతి సందర్భంగా ఫ్లెక్సీలు తొలగించడంతో మొదలైన ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య ఓ స్థల వివాదం ఏకంగా పై స్థాయి వరకూ వెళ్లింది. అధికారుల బదిలీలతో అది శాంతించినా.. ఇప్పటికీ రెండు వర్గాలు ఉప్పు, నిప్పులా ఉన్నాయి.ఇక గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పై స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన బీజేపీలోకి వెళ్తాననే బెదిరింపు ధోరణిలో ఉన్నారని, వైసీపీ శ్రేణుల్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు.మరోవైపు నెల్లూరులో ఓ జాయింట్ కలెక్టర్ తో వైసీపీ ఎమ్మెల్యేలకు పంచాయితీ ఉంది. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసి, నేరుగా పత్రికలకు ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సదరు జేసీ బదిలీకి రంగం సిద్ధమైందని అంటున్నారు. మరో ఉన్నతాధికారి బదిలీ విషయంలో మంత్రి మేకపాటి పట్టుబట్టగా, మరో మంత్రి అనిల్ దాన్ని అడ్డుకున్నారనే వార్తలున్నాయి.అంతర్గతంగా విభేదాలున్నా.. జగన్ ముందు మాత్రం అందరూ కలసికట్టుగానే ఉన్నట్టు కవర్ చేస్తూ వస్తున్నారు. విజయసాయిరెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ విషయాలన్నీ జగన్ కి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి.ఈనెల 11న రెండో విడత అమ్మఒడి ప్రారంభం కోసం నెల్లూరు వస్తున్న జగన్, ఈ గొడవల్ని తేల్చేస్తారని అనుకుంటున్నారు. జగన్ రాకతో నెల్లూరులో వర్గపోరు తగ్గుతుందా? నెల్లూరు విబేధాలకు జగన్ రిపేర్లు చేయగలరా? వేచి చూడాలి.