టీఆర్ఎస్ భారీ బహిరంగసభ

జీహెచ్ఎంసీ ఎన్నికలపై అన్ని పార్టీలు సీరియస్‌గా దృష్టి సారించాయి. గెలుపే పరమావధిగా ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటికే ఆరేళ్లలో తాము ఎలాంటి అభివృద్ధి చేశామన్న విషయాన్ని ఢంకా బజాయించి మరి చెబుతోంది. అటు కేసీఆర్, కవిత, కేటీఆర్ ఇదే పనిలో ఉన్నారు. ప్రెస్ మీట్లు,సోషల మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ప్రతిపక్షాల్ని ఢీకొట్టే రీతిలో భారీ సభకు వ్యూహాలు రచిస్తున్నారు.

మరోవైపు ఇవాళ్టితో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.గత ఎన్నికల్లో మొత్తం గ్రేటర్ బాధ్యతను కేటీఆర్‌కే అప్పగించారు గులాబీ బాస్. కానీ ఈసారి మాత్ర అన్నీ తానై రంగంలోకి దిగుతున్నారు. ఈసారి గ్రేటర్‌ పరిధిలో సీఎం కేసీఆర్‌ ఓ ప్రచార సభలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇక, గతంలో మాదిరిగానే.. మంత్రి, టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.. ఈ నెల 22వ తేదీ నుండి గ్రేటర్‌లో కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

కుత్బుల్లాపూర్ నుండి కేటీఆర్ రోడ్డు షోలు ప్రారంభం అవుతాయని చెబుతున్నారు టీఆర్ఎస్‌ నేతలు. ఇక, ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారని.. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. ఈ బహిరంగ సభ ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉండగా… దీనిపై కేసీఆర్‌ ఇవాళ తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది. కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే.. ఎన్నికల ప్రచారానికి సంబంధించి తామెలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి.