– హైదరాబాద్‌కు మోదీ సాయమెందుకు చేయరు?
– కర్ణాటక, గుజరాత్‌కు 4 రోజుల్లోనే ఇచ్చారుగా
– వరద నష్టంపై సీఎం కేసీఆర్ లేఖరాసి 25 రోజులైనా కేంద్రం ఒక్కరూపాయి ఇవ్వలేదు
– నలుగురు బీజేపీ ఎంపీలు నాలుగు పైసలు తేలేదు.. బీజేపీ, కాంగ్రెస్‌ది బురద రాజకీయం
– క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచాం.. తక్షణ సాయంగా 550 కోట్లు విడుదలచేశాం
– 4.30 లక్షల కుటుంబాలకు వరద సాయం.. మరో 100 కోట్లు కేటాయించేందుకూ సిద్ధం
– మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి
భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం వరద సాయం అందిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బురద రాజకీయాలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వానలో తడుస్తూ, నీళ్లలో నడుస్తూ టీఆర్‌ఎస్ నేతలు బాధితులకు అండగా నిలిస్తే.. నాడు దుబ్బాకలో ఓట్ల వేటలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఇప్పుడొచ్చి చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసి 25 రోజులు గడిచినా ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి లేఖ రాస్తే.. నాలుగు రోజులు కాకుండానే రూ.669.85 కోట్లు, గుజరాత్‌లో వరదలొస్తే రూ.500 కోట్లు తక్షణసాయంగా విడుదల చేశారని.. మరి తెలంగాణపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. నలుగురు బీజేపీ ఎంపీలు, ఓ కేంద్రమంత్రి ఉండికూడా కేంద్రం నుంచి నాలుగు పైసలు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. ఇన్నేండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌కు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కనీసం నాలాల ఆక్రమణలను కూడా ఆపలేకపోయిందని విమర్శించారు. ఎవరూ అడుగకముందే సీఎం కేసీఆర్ వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.550 కోట్లు విడుదల చేశారని చెప్పారు. అవసరమైతే మరో వందకోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
వందేండ్ల తర్వాత కుంభవృష్టి
1908లో హైదరాబాద్‌లో కురిసిన భారీవర్షాలకు మూసీ పొంగి లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1916లో 1,400 మిల్లీమీటర్లు కుంభవృష్టి కురిసింది. ఆ తర్వాత హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద వర్షం ఈ ఏడాది పడింది. ఆకాశానికి చిల్లు పడ్డట్టు వర్షపుధారలు కారాయి. దశాబ్దాలుగా నాలాల కబ్జా, చెరువులు, కుంటల ఆక్రమణలతో వర్షపునీరు వెళ్లేదారిలేక ఎక్కడిదక్కడే నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్‌లో వందల కాలనీలు, లక్షల ఇండ్లు నీట మునిగాయి. కోటిమందిదాకా ఇబ్బందులు పడ్డారు. క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరించింది. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేశారు. పంటనష్టం, ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులను పరుగులు పెట్టించారు. చాలామేరకు ప్రాణనష్టం నివారించగలిగాం.. కానీ, ఆస్తినష్టం మాత్రం జరిగింది. మన దేశంలో ఏ మెట్రో నగరంలో లేనట్లుగా తొలిసారి హైదరాబాద్‌లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను ప్రభుత్వం ముందే ఏర్పాటుచేసింది. జీహెచ్‌ఎంసీలో 800 మంది సిబ్బందితో డీఆర్‌ఎఫ్ ఇట్లాంటి వైపరీత్యాలు జరిగినపుడు రంగంలోకి దిగి ఎదుర్కొంటున్నది.
అందరం నీళ్లలోనే తిరిగాం
పది, పదిహేను రోజులపాటు వర్షం పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం ప్రజల్లోనే ఉంటూ వారికి అండగా నిలబడ్డాం. స్వయంగా పదుల సంఖ్యలో కాలనీలు తిరిగా. బోడుప్పల్, పీర్జాదిగూడ, మీర్‌పేట్, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రజల కష్టాలు చూసి చలించిపోయా. తక్షణ ఉపశమనం.. శాశ్వత పరిష్కారం దిశగా చేస్తున్న చర్యలను వివరించి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాం. కొందరి ఇండ్లలోకెళ్లి చూస్తే బియ్యం, పప్పులు అన్నీ తడిచిపోయాయని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించాం. స్పందించిన సీఎం.. ఊహించని విధంగా తక్షణసాయం కింద రూ.550 కోట్లు విడుదల చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ తక్షణమే రూ.10 వేలు అందించాలని సూచించారు. వర్షం పూర్తిగా బంద్ కాకముందే వరద సాయం ప్రకటించి మనసున్న ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ఇప్పటిదాకా 4.30 లక్షల కుటుంబాలకు సాయమందించాం. ఈ కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతూనే ఉన్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సహా అందరూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. సాయం పొందినవారి పేరు, ఇంటి నంబర్, ఫోన్ నంబర్ అన్ని వివరాలు మా వద్ద ఉన్నాయి. 4.30 లక్షల మంది డాటా ఉన్నది. ఆషామాషీగా, చిల్లర మల్లరగా సాయం చేయలేదు. దసరాలోపే సాయమందించాలనే పట్టుదలతో 920 అధికారిక బృందాలు ఏర్పాటుచేసి ఒక్కరోజే లక్ష మందికిపైగా పంపిణీ చేశాం. అడుగనిదే అమ్మయినా పెట్టదంటరు. కానీ ప్రజలు, ప్రతిపక్షాలు అడుగకముందే ముఖ్యమంత్రి రూ.550 కోట్లు ప్రకటించారు. గతంలో ఎవరన్న ఇచ్చారా? ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఇలా ఎవరైనా నిధులు విడుదల చేశారా?
నివేదిక అందగానే పంటనష్ట సాయం
భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై అధికారులు జిల్లాలవారీగా రిపోర్టులు తయారుచేస్తున్నారు. నివేదికలు అందగానే సీఎం కేసీఆర్ క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా పీర్జాదిగూడ, బోడుప్పల్, మీర్‌పేట, బడంగ్‌పేట్, కొంపల్లి.. ఇలా హైదరాబాద్ చుట్టూ 22 మున్సిపాలిటీల్లో వరద నష్టం జరిగింది. వరందరికీ సాయంచేశాం. ఇంకా చేస్తం. వరంగల్‌లో మూడునెలల కిత్రం వరదలొస్తే తక్షణ సాయంగా రూ. 25 కోట్లు ప్రకటించాం. నాలాలపై 400 అక్రమ నిర్మాణాలుంటే 300 కూలగొట్టాం. 100 కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఖమ్మంలోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎక్కడ సమస్య వచ్చినా వెంట నే స్పందిస్తున్నాం. నాలాలమీద దశాబ్దాలుగా కబ్జాలు జరుగుతున్నాయి. మేం వచ్చినంక పూర్తిస్థాయిలో కట్టడికి ప్రయత్నం చేశాం. జీహెచ్‌ఎంసీలో స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సార్డీపీ పద్ధతిలో ఉంటుంది. వివిధ కమిటీల రిపోర్టుల ఆధారంగా 2, 3 ఏండ్లలో శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేస్తున్నాం. నాలాల మీద ఉన్నఇండ్లు కూలగొట్టి అవసరమైతే డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చే వెసులుబాటు ఉంది. తక్షణ పరిష్కారం చూపే బాధ్యత.. శాశ్వత పరిష్కారమూ మాదే. గత ప్రభుత్వాల తప్పిదాలను సరిచేసే బాధ్యత మా మీద ఉన్నది. వారిపై నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేయం.
మేమే పరిష్కరిస్తాం
నాలాలమీద దశాబ్దాలుగా కబ్జాలు జరుగుతున్నాయి. మేం వచ్చినంక పూర్తిస్థాయిలో కట్టడికి ప్రయత్నం చేశాం. జీహెచ్‌ఎంసీలో స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. 2, 3 ఏండ్లలో శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేస్తున్నాం. నాలాల మీద ఉన్న ఇండ్లు కూలగొట్టి అవసరమైతే డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చే వెసులుబాటు ఉన్నది. తక్షణ పరిష్కారం చూపే బాధ్యత.. శాశ్వత పరిష్కారమూ మాదే. గత ప్రభుత్వాల తప్పిదాలను సరిచేసే బాధ్యత మా మీద ఉన్నది.
– మంత్రి కే తారకరామారావు
సీఎం లేఖకు ప్రధాని నుంచి సమాధానమే లేదు
వరదల వల్ల రూ.8,868 కోట్లు నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ అక్టోబర్ 15న ప్రధానికి లేఖరాశారు. ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఇదే పీఎం.. కర్ణాటక ముఖ్యమంత్రి లేఖ రాసిన నాలుగురోజుల్లోనే రూ.669.85 కోట్లు తక్షణ సాయం విడుదల చేశారు. గుజరాత్‌లో వరదలు సంభవిస్తే స్వయంగా హెలికాప్టర్‌లో వెళ్లి సందర్శించారు. ఆ రాష్ర్టానికి తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేశారు. తెలంగాణకు తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు, హైదరాబాద్‌కు రూ.465 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ కోరితే ప్రధాని మోదీ ఎందుకు స్పందించరు? కర్ణాటక, గుజరాత్ మాత్రమే దేశంలో అంతర్భాగమా? తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం కాదా? హైదరాబాద్‌కు కష్టమొస్తే స్పందించాల్సిన బాధ్యత ప్రధానికి లేదా? మీకు హైదరాబాద్ అన్నం పెడుతలేదా? ఆరేండ్లలో తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు కట్టింది. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా వచ్చే లక్షా 40 వేల కోట్లు మాత్రమే వచ్చాయి తప్ప.. ఒక్క పైసా ఎక్కువ రాలేదు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నరు. కేంద్రం నుంచి నాలుగు పైసలన్న తేలేదు. మన నగరం.. మన బీజేపీ అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నరు. కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి.. నిస్సహాయ మంత్రిగా మారిపోయారు.
దుబ్బాకలో కాంగ్రెస్‌కు డిపాజిటే రాదు
నాదాన్ దుష్మన్ కాంగ్రెస్ పార్టీ. మొన్నటిదాక దుబ్బాకలో మునిగితేలింది. అక్కడ డిపాజిట్ కూడా రాదు. ఇప్పుడు ఈడికొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ వాళ్లుకాదా? నాలాల మీద కట్టడాలు, చెరువుల మీద ఆక్రమణలు ఎప్పుడొచ్చినయి? నాలాల మీద 28 వేల ఆక్రమణలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడే కదా కిర్లోస్కర్ కమిటీ నివేదిక ఇచ్చింది. మా హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండునెలల జీతం వరద సాయంగా ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులకు కనీసం ఆ సంస్కారం ఉన్నదా? వీరు అధికారంలో ఉన్నపుడు నాలాలు, చెరువుల మీద ఆక్రమణలపై చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? మేం 350 బస్తీదవాఖానలు కట్టినం. కాంగ్రెస్‌వాళ్లకు కనీసం టాయ్‌లెట్లు కట్టాలనే ఆలోచనైనా వచ్చిందా? అన్ని పట్టణాలను స్వచ్ఛ పట్టణాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం.
దొంగలు పడ్డ ఆర్నెళ్లకు..
వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎక్కడున్నరు? పుట్టెడు దుఖంలోఉన్న ప్రజలకు అండగా మేముంటే.. ఇన్నాళ్లు దుబ్బాకలో ఓట్ల వేటలో ఉన్నవాళ్లు ఇప్పుడొచ్చి బురద రాజకీయాలు చేస్తున్నారు. విపత్తులో విజ్ఞతతో వ్యవహరించాలనే సోయి కూడా వారికి లేదు. మేం రాజకీయాలు మాట్లాడొద్దనే మాట్లాడలేదు. ఒకవైపు సహాయచర్యలు, రోడ్ల పునరుద్ధరణ నడుస్తున్నది. వరదల నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. కొంపల్లిలోని ఉమామహేశ్వర్ కాలనీ, ఉస్మాన్‌నగర్ ప్రాంతాల్లో ఇంకా నీళ్లు పోలేదు. పక్కన చెరువు నిండుకుండలా ఉన్నది. ఏమన్నా చేద్దామంటే ప్రమాదం జరుగుతుందని జాగ్రత్త పడుతున్నాం. మేమంతా ఈ పనుల్లో నిమగ్నమై ఉంటే.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. నిన్నమొన్న జోనల్ కమిషనర్ ఆఫీస్ అధికారులను బెదిరించారు. సైదాబాద్‌లో అభిషేక్ అనే ఒక బీజేపీ కార్యకర్త వరద సాయం తీసుకొని, ఫొటోలు దిగి.. తెల్లారిపోయి ధర్నాలో దిగిండు. ఇంత చిల్లర రాజకీయమా? ఇంత దిగజారుడు రాజకీయమా?
విపత్తువేళ ఖాతా నంబర్ అడగాల్నా..
ఇండ్లల్లోకి నీళ్లురావడంతో తమ సర్టిఫికెట్లు తడిసిపోయాయని పిల్లలు మాకు
చూపెట్టారు. బేగంపేటలో ఒక విద్యార్థి టెన్త్‌క్లాస్ సర్టిఫికెట్ ఇప్పించమని వేడుకున్నాడు. నీళ్లల్ల అన్నీ కొట్టుకుపోతే ఇంకా బ్యాంకు పుస్తకం ఎక్కడున్నది? అలాంటపుడు
బాధితుల వద్దకెళ్లి డబ్బులు వేస్తాం బ్యాంకు నంబర్ ఇవ్వండని అడుగుతమా?
విపక్షాలు కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి. కష్టంలో ఉన్నోడికి నాలుగుపైసలు చేతిలో పెడితే వెంటనే కిరాణంపోయి వస్తువులు తెచ్చుకొంటడు. ఆ మాత్రం తెల్వదా! వర్షం, వరద పోయినంక ఇప్పుడు వచ్చి మస్తుగ చెప్పొచ్చు ముచ్చట్లు. ఆ రోజు
ఎక్కడున్నరు? ఒక్కరన్న కనబడ్డరా?
– మంత్రి కే తారకరామారావు
మా సాయం ఆషామాషీ కాదు
ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ వరద బాధితులకు తక్షణసాయం కింద రూ.550 కోట్లు విడుదల చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ వెంటనే రూ.10వేలు అందించాలని సూచించారు. 920 అధికారిక బృందాలను ఏర్పాటుచేసి ఒక్కరోజే లక్ష మందికిపైగా సాయమందించాం. ఇప్పటిదాకా 4.30 లక్షల కుటుంబాలకు పంపిణీ చేశాం. సాయం పొందినవారి పేరు, ఇంటి నంబర్, ఫోన్ నంబర్ అన్ని వివరాలు మా వద్ద ఉన్నాయి. 4.30 లక్షల మంది డాటా ఉన్నది. ఆషామాషీగా, చిల్లర మల్లరగా సాయం చేయలేదు.
– మంత్రి కే తారకరామారావు
కేంద్రం స్పందించదా?
కర్ణాటకలో వరదలపై ఆ రాష్ట్ర సీఎం లేఖ రాస్తే ప్రధాని 4 రోజుల్లోనే రూ.669.85 కోట్లు ఇచ్చారు. గుజరాత్‌లో వరదలొస్తే హెలికాప్టర్‌లో వెళ్లి సందర్శించి.. తక్షణ సాయంగా రూ.500 కోట్లిచ్చారు. తెలంగాణలో వరదల వల్ల రూ.8,868 కోట్లు నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ అక్టోబర్ 15న లేఖరాస్తే ఇప్పటికీ స్పందన లేదు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ఎందుకింత వివక్ష?
మీకేది సంస్కారం?
మా పార్టీ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని వరద సాయంగా ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులకు కనీసం ఆ సంస్కారం ఉన్నదా?
విపత్తు వేళ ఖాతా నంబర్ అడగాల్నా?
ఇండ్లల్లోకి నీళ్లురావడంతో సర్టిఫికెట్లు తడిసిపోయాయని పిల్లలు మాకు చూపెట్టారు. బేగంపేటలో ఒక విద్యార్థి టెన్త్‌క్లాస్ సర్టిఫికెట్ ఇప్పించమని వేడుకున్నాడు. నీళ్లల్ల అన్నీ కొట్టుకుపోతే ఇంకా బ్యాంకు పుస్తకం ఎక్కడున్నది? అలాంటపుడు బాధితుల వద్దకెళ్లి ‘డబ్బులు వేస్తాం.. బ్యాంకు నంబర్ ఇవ్వండి’ అని అడుగుతమా?