తమిళనాడుకు చేరుకున్న శశికళ

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలోని ఎంజీఆర్‌ నివాసానికి చేరుకుని జయలలిత చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకుముందు తన అనుచరులతో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించారు.

కర్నాటక రాజధాని బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవించి జనవరి 27న విడుదల అయ్యారు. అయితే ఆమె ఇటీవల కరోనా బారినపడడంతో అస్వస్థతకు గురయ్యారు. చికిత్స తీసుకున్న అనంతరం క్వారంటైన్‌ కాలం పూర్తి చేసుకుని సోమవారం బెంగళూరు నుంచి తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శశికళకు పెద్ద ఎత్తున అభిమానులు, ఆమె అనుచరులు భారీ స్వాగతం పలికారు. పదుల సంఖ్యలో కాన్వాయ్‌లు బారులు తీరాయి. వేలాది మంది అభిమానులు ఆమె వెంట ఉన్నారు.

అయితే శశికళ జైలు నుంచి విడుదల కాకముందే అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపై కేసు వేసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఇంకా తన పార్టీగా పేర్కొంటూ శశికళ రెండాకుల పార్టీ పతాకాన్ని ఆమె తన వాహనానికి వినియోగించుకున్నారు. తాజాగా తమిళనాడుకు చేరుకున్న సమయంలో కూడా అదే గుర్తు ఉన్న జెండాలు కనిపించాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాలతో శశికళ బిజీ కానున్నారు. దీంతో తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయోనని తమిళ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

అయితే శశికళ రాకపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. జయలలిత సమాధి, స్మారక మందిరం మూసివేయగా.. శశికళ పోస్టర్లు అతికించవద్దని నిషేదాజ్ఞలు విధించింది. దీంతోపాటు రెండాకుల గుర్తు వాడకంపై ఇప్పటికే అన్నాడీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం 2 కేసులు నమోదు చేయించిన విషయం తెలిసిందే.