ఇప్పుడు రజనీకి అసలు పరీక్ష…

అనారోగ్యం కావొచ్చు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కావొచ్చు, అంతర్గత సర్వేలో వెళ్లడైన చేదు ఫలితాలు కావొచ్చు.. మొత్తానికి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావట్లేదని కుండబద్దలు కొట్టేసి రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది రజనీకాంత్ పరిస్థితి.ఇన్నాళ్లూ వైరి పక్షాలన్నీ రజనీపై విమర్శలు చేస్తూ ఆయన్ని టార్గెట్ చేశాయి, ఇప్పుడు ఆయనపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ మద్దతు కోసం వెంపర్లాడటం మొదలుపెట్టాయి. ఈ ఒత్తిడిని తట్టుకోవడం రజనీకి తలకు మించిన భారంగా మారుతోంది.రోజుకో పార్టీ నేత ఫోన్ చేసి విసిగిస్తున్నారట. పార్టీ పెట్టాలంటూ ఒత్తిడి చేసే అభిమానులు మెల్లగా సైడైపోయారు కానీ, ఇప్పుడు తమ పార్టీకి మద్దతివ్వండి అంటూ ఒత్తిడి తెచ్చేవారి సంఖ్య మరీ ఎక్కువవుతోందని రజనీ కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

కమల్ హాసన్ ఒత్తిడి మరీ ఎక్కువ..

రజనీ పార్టీ పెట్టకముందే కమల్ హాసన్ ఆయనతో కలసి పనిచేస్తామని చెప్పారు, తామెప్పుడూ వేర్వేరు కాదని, ఒకే ఆశయం కోసం రాజకీయాల్లోకి వస్తున్నామని అన్నారు. అయితే ఇప్పుడు రజనీ రాజకీయాల్లోకి రాకపోవడాన్ని కూడా కమల్ స్వాగతించారు.రజనీ నిర్ణయంపై నిరుత్సాహపడినప్పటికీ, ఆయన ఆరోగ్యంగా ఉండటమే అందరికీ అవసరమని, త్వరలోనే తన మిత్రుడిని కలుస్తానని స్టేట్ మెంట్ ఇచ్చారు.కమల్ రజనీతో భేటీ అయితే ఆ వెంటనే వారిద్దరి మధ్య చర్చకు వచ్చేది మద్దతు వ్యవహారమే. “నీవెలగూ రాజకీయాల్లోకి రావట్లేదు, కనీసం నాకైనా మద్దతివ్వు, మిగతా సంగతి నేను చూసుకుంటా” అని కమల్ అడగబోతున్నట్టు సమాచారం.ఒకవేళ.. కమల్ కి రజనీ మద్దతిస్తే.. తమిళనాడు రాజకీయాల్లో అది మరో సంచలనంగా మారుతుంది. మిగతా పార్టీలన్నీ ఈజీగా సూపర్ స్టార్ ని టార్గెట్ చేస్తాయి.

బీజేపీ ఒత్తిడిని రజనీ తట్టుకోగలరా..?

ఆధ్యాత్మిక రాజకీయాలంటే.. బీజేపీ భావజాలంతోనే రజనీ రాజకీయాలు చేయబోతున్నారంటూ కమలదళం.. ముందే ఆయనపై కర్చీఫ్ వేసింది. ఆయన మాటల్ని తమకి అనుకూలంగా మార్చేసుకుంది. రజనీ రాజకీయాల్లోకి వచ్చినా, బీజేపీకి మద్దతిస్తారనే వార్తలు గతంలో బాగానే వినిపించాయి.ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతిస్తే.. పరోక్షంగా మేళ్లు జరుగుతాయనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. నేరుగా రాజకీయాల్లో వేలు పెట్టడంలేదు కాబట్టి.. బీజేపీకి మద్దతిస్తారేమోననే అనుమానాలు కూడా తమిళనాట వ్యక్తమవుతున్నాయి.

మిగతా పార్టీలు ఏమంటున్నాయి!

నిన్న మొన్నటి వరకూ రజనీని తిట్టిపోసిన డీఎంకే, అన్నాడీఎంకే కూడా స్వరం మార్చాయి. రజనీ రాజకీయ పార్టీ పెట్టడంలేదనే వార్తను స్వాగతించాయి. రజనీ ఆరోగ్యంపై ఎక్కడలేని ఆత్రుతను ప్రదర్శించాయి. డీఎంకే నుంచి ఎవరూ నేరుగా స్టేట్ మెంట్ ఇవ్వకపోయినా.. రజనీని మద్దతు కోరే విషయంలో పార్టీలో చర్చ జరిగినట్టు సమాచారం.ఇక అన్నాడీఎంకేలో కీలక నేతలు.. నేరుగా మీడియాకు స్టేట్ మెంట్లు ఇచ్చారు. తమిళనాడులో ఎంజీఆర్ పాలన కొనసాగాలని రజనీ ప్రకటించాలాని కోరుతున్నారు. పరోక్షంగా సూపర్ స్టార్ పై ఒత్తిడి తెస్తున్నారు.తమిళనాడు కాంగ్రెస్ నేతలు సైతం.. బీజేపీ కుట్ర నుంచి రజనీ బైట పడ్డారని, అందుకే పార్టీపై వెనకడుగేశారని చెబుతున్నారు. పార్టీ పెడితే బీజేపీతో రజనీ కలసి ఉన్నట్టు.. ఇప్పుడు పార్టీ పెట్టలేదు కాబట్టి పరోక్షంగా రజనీ బీజేపీ వ్యతిరేకులకు మేలు చేసినట్టు అంటున్నారు.మొత్తమ్మీద రజనీకాంత్ పార్టీ పెడుతున్నానంటే రాళ్లు వేసినవారే… ఇప్పుడాయన వెనక్కి తగ్గేసరికి పూల వర్షం కురిపిస్తున్నారు. పనిలోపనిగా మాకే మద్దతివ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఉన్న ఒత్తిడి కంటే ఇది వంద రెట్లు ఎక్కువనే విషయం సూపర్ స్టార్ కి ఈపాటికే అర్థమైంది.మరి భవిష్యత్తులో ఆయన ఏవైపు మొగ్గుతారో, అభిమానులకు ఏమని సందేశం ఇస్తారో వేచి చూడాలి. రజనీ ఏవైపు మొగ్గు చూపినా.. మరోవైపు నుంచి ఆయన కచ్చితంగా వైరి పక్షాలకు టార్గెట్ అవుతారు. నేరుగా రాజకీయాల్లోకి దిగకపోయినా, సూపర్ స్టార్ కు రాబోయే రోజుల్లో పొలిటికల్ సెగ తప్పేలా లేదు.