కేఏ పాల్ ఎక్కడో తన పని తాను చేసుకుంటూ రోజుకోసారి ఫేస్ బుక్ లైవ్ లోకి వస్తూ.. రాష్ట్ర రాజకీయాల్లో తానూ ఉన్నానని ఉనికి చాటుకుంటున్నారు. క్రిస్మస్ బహిరంగ సభలకి విశాఖలో పోలీసులు అనుమతివ్వకపోవడంతో.. ఆయన చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. వైఎస్ఆర్ మరణాన్ని సైతం తెరపైకి తెచ్చి తన శాపంతోనే అది జరిగిందని, సీఎం జగన్ తన శాపానికి గురి కాకుండా ఉండాలని హితవు పలికారు.కేఏపాల్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రవర్తిస్తున్నారు. పాల్ విదేశాల్లో ఉంటే, పవన్ పొరుగు రాష్ట్రంలో ఉన్నారు. ఆయన ఫేస్ బుక్ ని వాడుకుంటే, ఈయన ట్విట్టర్ బాగా వాడతారు. రోజుకో అంశంపై పాల్ విరుచుకుపడుతుంటే.. రోజూ ఒకే విషయాన్ని హైలెట్ చేస్తూ పవన్ రెచ్చిపోతున్నారు.ఇద్దరూ వేర్వేరు రంగాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారే. సొంతగా పార్టీ పెట్టి.. ఇతర పార్టీలతో పొత్తు అంటూ కాలక్షేపం చేస్తున్నవారే. నేతలిద్దరికీ, వారు సారథ్యం వహిస్తున్న పార్టీలకు విధి విధానాలేవీ లేవు.పొత్తులో ఉన్న పార్టీలను పొగడటం, వైరి పక్షాలపై దుమ్మెత్తి పోయడం, అవసరమైతే మతాన్ని మధ్యలోకి లాగి నానా హంగామా చేయడం. ఇదీ ప్రస్తుతం వీరిద్దరూ చేస్తున్న పని. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. పవన్ కు అభిమానులు ఉన్నట్టే పాల్ కు కూడా అతడి వర్గంలో అభిమానులున్నారు.ఓవైపు జగన్ ని క్రిస్టియన్ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి పాల్ ఆపసోపాలు పడుతున్నారు, మరోవైపు ఆయన క్రిస్టియన్లకు మేలు చేస్తున్నారని, హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారని చెప్పడానికి పవన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరి వాదనల్లో ఏది కరెక్ట్.ప్రజామోదం లేని, పోటీ చేస్తే గెలవలేని వీరిద్దరూ పార్టీలకు అధినేతలు. పాల్ కీ, పవన్ కీ పోలిక పెట్టడం కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వారిద్దరికీ పెద్దగా తేడా లేదు. కేఏపాల్ కేవలం మత ప్రభోదకుడిగా ఉన్నప్పుడు ఆయనంటే రాజకీయ నాయకులకి కూడా అపార గౌరవం ఉంది. ఆయన ”వాక్యానికి” కోట్లాదిమంది అభిమానులున్నారు. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చి ఆయన తన పరపతి పోగొట్టుకున్నారు.పవన్ కూడా అంతే.. సినిమాల్లో ఆయన తిరుగులేని పవర్ స్టార్. కాల్షీట్ల కోసం క్యూ కట్టే నిర్మాతలు, ఒక్క ఛాన్స్ అంటూ వెంటపడే దర్శకులు. ఇలా ఉంది వ్యవహారం. వరుస ఫ్లాపులున్నా.. అత్యథిక ఓపెనింగ్స్ వచ్చే ఏకైక హీరోగా పవన్ కి పేరుంది. అలాంటి పవర్ స్టార్.. రాజకీయాల్లోకి వచ్చి జీరోగా మారారు. ప్రతిసారి ఎవరో ఒకరికి కొమ్ము కాస్తూనే ఉన్నారు. ఒక చేత్తో తన జెండా, మరో చేత్తో ఎవరిదో అజెండాను భుజాన మోస్తూనే ఉన్నారు.ఇప్పుడిద్దరూ సోషల్ మీడియా రాజకీయం చేస్తున్నారు. తలతిక్కగా మాట్లాడుతున్నారు, తలాతోకా లేని వాదనలు వినిపిస్తున్నారు. చిటికేస్తే అధికారం మాదేనంటూ ఊహా లోకంలో బతికేస్తున్నారు. పాల్-పవన్ రైమింగ్ వర్డ్స్ మాత్రమే కాదు, పూర్తిగా రైమింగ్ లో ఉన్న రెండు రాజకీయ విష వలయాలు కూడా.
