ప్రస్తుత భారతీయ సినీ జగత్తులో ఒక్క అమితాబ్ బచ్చన్ సరసన కూర్చోతగిన ఏకైక సూపర్ స్టార్ – రజనీకాంత్‌కు అభినందనలు తెలియ చేయాల్సిన సమయం ఇది. మహారాష్ట్రీయుడైనప్పటికీ బతుకు తెరువు రీత్యా తమిళ సినిమా పరిశ్రమను ఆశ్రయించడం అక్కడ ఊహించలేంత ఎత్తుకు ఎదగడంతో- రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఆయన అభిమానుల్లోంచి వెల్లువెత్తింది. ఇది తనకు మోయలేని భారమనే విషయం ఆయనకు పాతికేళ్ల క్రిందటే తెలిసినప్పటికీ ఆ విషయాన్ని ఆయన బయటికి చెప్పలేక పోయారు, అభిమానులను నిరాశకు గురి చేయలేక.నిజానికి, ‘రాజకీయం’ అనేది ఒక కిల్లర్ ఇంస్టిక్ట్. ఆ భావనకు లోనైన సినిమా హీరోలు , రాజకీయాల్లో చేరే మొదటి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ‘అది’ – ఆ అర్జ్-ఆ అభిలాష కలిగిన వారి రక్తంలోనే ఉంటుంది.ఎం.జీ. రామచంద్రన్, జయలలిత, కరుణానిధిని చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. వారు ఎకాఎకిని రాజకీయాల్లోకి అలా వచ్చి, ఇలా ముఖ్యమంత్రి అయిపోవాలని భావించలేదు. అప్పటికే ఉన్న రాజకీయ పార్టీల్లో చేరి, ఢక్కా ముక్కీలు తిని, అనుభవం సంపాదించి, ప్రజాభిమానం (ఫాన్స్ అభిమానానికి తోడు) సంపాదించిన తర్వాతే- ఏనుగు కుంభస్థలాన్ని కొట్టారు.తమిళనాట శివాజీ గణేశన్‌తో సహా చాలామంది ప్రయత్నించినా- ‘ ఉట్టి’ ని కొట్ట లేకపోయారు. సినిమాలలో నటించినంతగా ప్రజాజీవితంలో నటించలేకపోవడం ఇందుకు ఒక కారణం కావచ్చు. నటించినా- ప్రజామోదం పొందలేకపోవడం మరో కారణం కావచ్చు.తెలుగు రాష్ట్రానికి సంబంధించి- ఎన్టీ రామారావు ఒక్కరే- జన జీవితంలోనూ అద్భుతమైన, అనితర సాధ్యమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించగలిగారు. రామారావుకు ముందు, వెనుక చాలా మంది సినిమా వాళ్ళు ప్రజా జీవితంలో నటించబోయారు కానీ సహాయ పాత్రలతోనే సరి పెట్టుకోవలసి వచ్చింది.అంతదాకా ఎందుకు? భారతదేశ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను మించిన సూపర్ స్టార్ మన దేశ లోనే లేరు కదా! 1984 లోకసభ ఎన్నికల్లో ఆయన అలహాబాద్ లోకసభ స్థానం నుంచి నామినేషన్ వేశారు. ఆయనకు వచ్చిన మెజారిటీ సుమారు లక్షా ఎనభై ఏడు వేలు. ఆ స్థానం నుంచి- లాల్ బహదూర్ శాస్త్రి, మురళి మనోహర్ జోషి, వీ పీ సింగ్ వంటి రాజకీయ ఉద్దండులు సైతం పోటీ చేసినప్పటికీ- అమితాబ్ మెజారిటీ రికార్డ్‌ను అధిగమించలేకపోయారు.అయినప్పటికీ ప్రజా జీవితంలో నటించడం తనవల్ల కావడం లేదంటూ -ఆయన మధ్యలోనే తన ఎం.పీ పదవికి రాజీనామా చేసేసి వెళ్లిపోయారు. గత 35 సంవత్సరాలలో ఆయన రాజకీయాల వైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు. రాజకీయాల్లోకి రావాలన్న సినిమా వాళ్ళు , ఏకాఎకిని టాప్ పొజిషన్‌లోకి రావాలని భావించడం కద్దు. అది కుదరక పోతే, మళ్లీ పాత పాత్రల్లోకి ఒదిగిపోతుంటారు. ప్రజా జీవితంపై అంకిత భావం, చిత్తశుద్ధి లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.తాను ప్రజా జీవిత నటనకు పనికి రానని రజనీ కాంత్ దృఢంగా భావించడం వల్లే- అభిమానుల రాజకీయ ఆకాంక్షలకు ‘శుభం’ కార్డు వేయాలని ఆయన ఎట్టకేలకు నిర్ణయించుకున్నారు. ఆయనకు సుమారు 50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అభిమానుల నుంచి ఈ డిమాండ్ వెల్లువెత్తినప్పటికీ సుమారు పాతిక సంవత్సరాల పాటు వారిని జోకొడుతూ వచ్చారు. తాను రాజకీయ క్షుద్ర విద్యలకు పనికిరాననే విషయం తనకు తెలుసన్న విషయం, తన అభిమానులకు తెలియచేయడానికి ఆయన ఇంత సమయం తీసుకున్నారు.ఇప్పుడు వెల్లివిరుస్తున్న సమాచార విప్లవం, ఓటర్ చైతన్యం,మారిన రాజకీయ సరళి మొదలైనవి ఎం.జీ. ఆర్, జయలలిత, ఎన్. టీ. ఆర్ నాటి రోజుల్లో లేవు. వారు రాజకీయ నటనలో- ‘అహో..’ అనిపించుకోడానికి ఇవి కూడా ఒక కారణం.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న రజనీకాంత్ సరైన నిర్ణయం, బాధ్యతాయుతమైన నిర్ణయం, సగౌరవమైన నిర్ణయం, అంత్యనిష్ఠూరం కంటే…ఆది నిష్ఠూరమే మేలు అనిపించే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా -అంత్య నిష్ఠూరమైనా -భేషైన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నటనకు స్వస్తి చెప్పారు.
మరో సూపర్ స్టార్ కమలహాసన్, మన పవర్ స్టార్ ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటారో..!