పౌరులపై భారం పడుతుందని చెప్పిన నిర్మల సీతారామన్

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ‘ధర్మసంకట్'(పెద్ద సందిగ్ధత)గా మారాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణం గా పౌరులపై భారం పడుతున్నట్లు ఆమె అంగీకరించారు. ప్రజలపై పడే భారాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్‌పై కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తుందని తెలిపారు. ఇప్పుడదే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు నిర్మల సీతారామన్ పేర్కొంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ఏకైక మార్గం కేంద్రం, రాష్ట్రాలు చర్చలు జరపడమేనని ఆమె అన్నారు.

అంతకు ముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇంధన ధరలను తగ్గించడానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలని అని అన్నారు. “కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చలు అవసరం. వీలైనంత త్వరగా పన్నులు తగ్గించడం చాలా ముఖ్యం” అని శక్తికాంత దాస్ అన్నారు. గత వారాంతాన పెట్రో ధరలు పెరిగిన తర్వాత వరుసగా ఆరు రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా ఆర్థిక రాజధాని ముంబైలో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.