ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వాస్‌ హత్య

తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వాస్‌ హత్య కేసులో బీజేపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సీఐడీ దాఖలు చేసిన అభియోపత్రాల్లో అతని పేరును చేర్చింది. సత్యజిత్‌ హత్య కేసులో ముకుల్‌ పాత్ర ఉన్నట్లు ఆనుమానిస్తున్నామని, దీనిపై మరింత లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది. ఇతనితో పాటు మరికొందరు బీజేపీ స్థానిక నేతల పేర్లుకూడా సీఐడీ నమోదు చేయడం బెంగాల్‌లో కలకలం రేపింది. ఈ విషయంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగుతోంది. టీఎంసీ ఎమ్మెల్యే హత్య కేసులో తనను తన పేరును ప్రస్తావించడాన్ని ముకుల్‌ తీవ్రంగా ఖండించారు.

రాజకీయంగా కక్షసారింపులో భాగంగానే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు తనపై అక్రమంగా 41 కేసులు నమోదు చేశారని, తానేంటో బెంగాల్‌ ప్రజలకు తెలుసిన స్పష్టం చేశారు. టీఎంసీలో ఉన్న వరకు తనపై ఎలాంటి కేసులు లేవని, బీజేపీలో చేరిన అనంతరమే ఇన్ని కేసులు బనాయించారని మండిపడ్డారు. కాగా ఇదే కేసులో బీజేపీ ఎంపీ జగన్నాథ్‌ సర్కార్‌ పేరును కూడా సీఐడీ నమోదు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరిలో సర్వసతి పూజ సందర్భంగా టీఎంసీ ఎమ్మెల్యే సత్యజిత్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బీజేపీ నేతల హస్తం ఉందని మమత తొలినుంచీ ఆరోపిస్తున్నారు.