అభివృద్ధి పనులు వేగవంతం చేస్తాం : కొప్పుల ఈశ్వర్

👉జహంగీర్ పీర్ దర్గా పరిసరాలను అభివృద్ధి చేస్తాం
👉అజ్మీర్ లో రుబాత్ నిర్మాణానికున్న అడ్డంకులను అధిగమిస్తున్నాం
👉 నాంపల్లిలో అనీసుల్ గుర్భా నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం
మంత్రి కొప్పులఈశ్వర్
హైదరాబాద్:జహంగీర్ పీర్ దర్గా పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని, అజ్మీర్ లో రుబాత్ నిర్మాణానికున్న అడ్డంకులను తొందర్లోనే తొలగిస్తామని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి,అజ్మీర్ లో రుబాత్, నాంపల్లిలో అనీసుల్ గుర్భా నిర్మాణాల గురించి శుక్రవారం మంత్రి సమీక్షించారు.పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ దామోదర్ గుప్తా,వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీం, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, వక్ఫ్ బోర్డు సిఇవో ఖాసీం, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులతో మంత్రి సమీక్షించారు.ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో, ముఖ్యమంత్రి పదవి చేపట్టాక కెసిఆర్ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించి మొక్కు చెల్లించుకోవడాన్ని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి ప్రజలకిచ్చిన హామీ మేరకు ఈ దర్గాను 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.దర్గా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు, భక్తుల సౌకర్యార్థం షెడ్లు,వంట,భోజనాల గదులు,దుకాణాలను నిర్మించాలని సూచించారు.అలాగే,పిల్లల ఆహ్లాదం కోసం ఆటస్థలం,బొమ్మలతో పాటు వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.అలాగే, రాజస్థాన్ లోని అజ్మీర్ ఖాజా మొయినుద్దీన్ ఛిస్తీ దర్గా వద్ద తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల కోసం తలపెట్టిన రుబాత్ నిర్మాణానికి ఎదురైన అడ్డంకుల గురించి అధికారులు మంత్రికి వివరించారు.దీని పరిష్కారానికై ముఖ్యమంత్రి అనుమతితో అజ్మీర్ కు వెళ్లి వద్దామని మంత్రి చెప్పారు.నగరంలోని నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద 20కోట్ల రూపాయలతో నిర్మాణంలో ఉన్న అనీసుల్ గుర్భా పనుల వేగాన్ని పెంచాలని ఈశ్వర్ అధికారులను కోరారు.