సాగర్ బరిలో జానారెడ్డి?

కాంగ్రెస్ అధిష్టానవర్గం టీపీసీసీ అధ్యక్షుడు ఎవరో పేరు బయట పెట్టకుండా వాయిదా వేసింది. ఇందుకు కారణం కాగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అయిపోయాక టీపీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటించాలని ఆయన హైకమాండ్ ను కోరాడు. ఇప్పుడే పేరు ప్రకటిస్తే పార్టీలో అభిప్రాయ భేదాలు వస్తాయని, గందరగోళంగా తయారవుతుందని, ఈ ప్రభావం సాగర్ ఉప ఎన్నిక మీద పడి విజయాకాశాలు దెబ్బతింటాయని చెప్పారు. ఇందుకు కారణం నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ భర్తిగా పోటీ చేయాలని జానా నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన చెప్పిన సలహాను అధిష్టానం గౌరవించి అంగీకరించింది. మరి జానారెడ్డి సాగర్ లో గెలుస్తాడని, పార్టీకి మళ్ళీ వైభవం వస్తుందని అధిష్టానం భావిస్తోందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం కారణంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే కదా.  ఈ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్.. దుబ్బాక తరహాలో ఇక్కడ కూడా సత్తా చాటాలని బీజేపీ, ఒకప్పటి కంచుకోటను మళ్ళీ ముట్టడించాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి.  అప్పుడే వ్యూహారచన మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డిని ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.అయితే ఇందుకు ఆయన సుముఖంగా లేరనే ప్రచారం జరిగింది. తనకు బదులుగా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించాలని జానారెడ్డి యోచిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నాగార్జునసాగర్‌లో పోటీ చేసే విషయంలో జానారెడ్డి మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపికను నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు ఆపాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి కావడం, సీనియర్ నేత కావడంతో జానారెడ్డి ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించిందని తెలుస్తోంది.ఇదే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆ ఆదేశాలను పాటిస్తామని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలంతా అంగీకరించినట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ గెలుపు చాలా ముఖ్యమని.. పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో కచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని ఆదేశించినట్టు సమాచారం.మొత్తానికి కాంగ్రెస్ తరపున జానారెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో నిలవడం ఖాయం కావడంతో.. ఇక బీజేపీ, టీఆర్ఎస్‌లు సైతం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంపై ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దుబ్బాక గెలిచి, గ్రేటర్లో సత్తాచాటిన బీజేపీ ఫుల్ జోష్ లో ఉన్న సమయంలో నోముల మరణంతో సాగర్ ఖాళీ అయింది. వెంటనే బీజేపీ జానారెడ్డి మీద కన్నేసింది. ఆయన చాలా కాలం నుంచి రాజకీయాలకే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జానా తెరమీదికి రాలేదు.జానా బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా సాగర్ లో పోటీ చేస్తారనే ప్రచారం తీవ్రంగా జరిగింది. తాను పోటీ చేయనని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎం అవుతాను కాబట్టి తన కొడుకు పోటీ చేస్తాడని ఆయన బీజేపీ నేతలకు చెప్పినట్లు ప్రచారమైంది. చివరకు సీన్ మారింది. మళ్ళీ జానా రెడ్డే కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.