జనవరిలో గ్రేటర్ ఎన్నికలు, GHMC తెరాస నేతల  మనోభావాల పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం

వరద సహాయ పనుల్లో అవకతవకలకు గానూ వరదబాధితుల ఆగ్రహావేశాలను చవిచూస్తున్న తెరాస పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఇప్పట్లో గ్రేటర్ ఎన్నికల జోలికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ముందస్తు ఎన్నికలు జరపాలనే అంశంపై టీఆర్‌ఎస్‌ పునరాలోచనలో పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇటీవల సంభవించిన వరద నష్టం నుంచి నగరవాసులు పూర్తిగా కోలుకోకముందే ఎన్నికలకు వెళ్తే నష్టం జరుగుతుందనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

మరోవైపు వరద సహాయక చర్యల్లో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం కూడా స్వల్ప వ్యవధిలో ఎన్నికల సన్నాహాలు చేయలేమనే నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితి కుదుటపడిన తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తీసుకెళ్లినట్లు సమాచారం.

కనీసం 45 రోజుల తర్వాతే ఎన్నికల షెడ్యూలు విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు సీఎం అంగీకరిస్తే డిసెంబర్‌ నెలాఖరులో షెడ్యూలు విడుదల చేసి జనవరి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని విశ్వసనీయ సమాచారం.
గ్రేటర్‌ పరిధిలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇంకా పలు కాలనీలు బురదలోనే ఉండటంతో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో మునిగిపోయింది. కనీసం అడుగు పెట్టే పరిస్థితి లేని జనావాసాల్లో తాత్కాలిక మరమ్మతులపై జీహెచ్‌ఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తే సన్నద్ధం కావడం అసాధ్యమని అధికారులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 22 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన జీహెచ్‌ఎంసీని ‘మినీ అసెంబ్లీ’గా పరిగణిస్తారు. దీంతో అధికార యంత్రాంగాన్ని భారీగా మోహరించాల్సి రావడంతో ఎన్నికల వాయిదాకు అధికారులు మొగ్గు చూపుతున్నారు.

మూడ్రోజుల కింద గ్రేటర్‌ పరిధిలోని మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ ఎన్నికలను వాయిదా వేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కేటీఆర్‌ను కోరినట్లు సమాచారం.
వరద బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం పంపిణీ గందరగోళంగా మారిన ప్రస్తుత సమయంలో ఎన్నికలకు వెళ్తే వ్యతిరేకత వస్తుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ముందస్తు ఎన్నికలు జరిగితే పార్టీ యంత్రాంగాన్ని తక్కువ వ్యవధిలో సమన్వయం చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.