గ్రేటర్ లో వేగం పెంచిన కారు…

గ్రేటర్ ఎన్నికల తరుణంలో కారు వేగం పెంచింది.టీఆర్‌ఎస్‌ జెడ్‌స్పీడ్‌తో దూసుకుపోతున్నది.ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపిక కోసం ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. మొత్తం 150 డివిజన్లకు గాను 125 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ మూడో జాబితాపై వేగంగా కసరత్తు చేస్తున్నది. నామినేష్న్ల ప్రక్రియ నేటితో ముగియనుండడంతో ఆయా పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. తెరాస అభ్యర్థుల ఎంపికలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. అభ్యర్థులపై పార్టీలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నది. కరోనా, వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అందించిన సాయం తదితర అంశాలను ప్రజల్లోకి విస్త ృతంగా తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ కార్యకర్తలకు ఇదివరకే దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. వారు పాదయాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
21 నుంచి కేటీఆర్‌ రోడ్‌ షో:
గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా టీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ రోడ్‌షోలను నిర్వహించనున్నారు. గత జీహెచ్‌ఎంసీ, శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఆయన రోడ్‌షోలను నిర్వహించగా సత్ఫలితాలు రావడంతో మరోసారి సిద్ధమవుతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోలు చేపట్టనున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున గ్రేటర్‌లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నది.