హైదరాబాద్, తీస్మార్ న్యూస్: టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో పేదల పవిత్ర గ్రంథమని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అభివర్ణించారు. మ్యానిఫెస్టోలో అన్నివర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తంచేస్తూ హిమాయత్‌నగర్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి గంగుల క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.‘కనీవినీ ఎరుగనిది.. గతంలో ఏ ముఖ్యమంత్రీ తీసుకోని సాహసోపేత నిర్ణయమిది. నిజంగా పేదలంటే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద మనసుతో ఆలోచిస్తారో చెప్పేందుకు మరో నిదర్శనమిది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో అద్భుతం’ అంటూ అన్నివర్గాలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను మనసారా స్వాగతిస్తున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రజక సంఘాల సమితి, తెలంగాణ రజక విద్యార్థి విభాగం ప్రతినిధులు డప్పు చప్పుళ్లతో భారీఎత్తున తరలివచ్చి తెలంగాణభవన్ ముందు కోలాహలం చేశారు. పటాకులు కాల్చి కృతజ్ఞతను చాటుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫిలింనగర్‌లోని శంకర్‌విలాస్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సెలూన్లకు ఉచిత విద్యుత్ ప్రకటనపై నాయీబ్రాహ్మణ సంఘం నాయకుడు నరేందర్ సంతోషం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను శాలువాతో సన్మానించారు. కులవృత్తులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించడంపై సోమాజిగూడ డివిజన్ ఎన్నికల ఇంచార్జి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
కులవృత్తుల్లో ‘వెలుగులు’
ఎంబీసీ కులవృత్తులవారికి ఉచిత విద్యుత్ అందిస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై ఎంబీసీ కులసంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకొంటున్నారు. కరోనాతో ఉపాధి దెబ్బతిన్న లక్షల మంది వృత్తిదారులకు ఈ నిర్ణయం కొండంత ఊరటనిచ్చిందని ఎంబీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు కలుకూరి రాజు పేర్కొన్నారు. రజక, నాయీబ్రాహ్మణ, గంగపుత్ర, విశ్వకర్మ వృత్తిదారులకు టీఆర్‌ఎస్ సర్కారు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతిఒక్కరు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రజక సంఘాల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం
ల్యాండ్రీ షాప్‌లకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై రాష్ట్రవ్యాప్తంగా రజకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలోని 50 వేల ల్యాండ్రీ యూనిట్లకు, వెయ్యి దోబీఘాట్లకు, 8 ఆధునిక ల్యాండ్రీ యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలంగాణ రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు కొండూరు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మన్ అక్కిరాజు శ్రీనివాస్, కన్వీనర్ మానస గణేశ్, సలహాదారు పంజగారి ఆంజనేయులు, కోకన్వీనర్లు మరిశెట్టి చంద్రమౌళి, కోట్ల శ్రీనివాస్, ప్రేమ్‌కుమా ర్, కోట్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాయీబ్రాహ్మణుల సంబురాలు
సెలూన్ల నిర్వహణకు వినియోగించే విద్యుత్‌ను ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై నాయీబ్రాహ్మణులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల సంబురాలు చేసుకున్నారు. హైదరాబాద్ నాగోల్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తమ సమాజం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ ప్రకటించారు.
పారిశ్రామికరంగానికి రాయితీలపై టీఐఎఫ్ హర్షం
కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామికరంగాన్ని ఆదుకొనేందుకు జీహెచ్‌ఎంసీ మ్యానిఫెస్టోలో టీఆర్‌ఎస్ పొందుపర్చిన అంశాలపై తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) హర్షం వ్యక్తంచేసింది. పారిశ్రామికవేత్తల నష్టాలను, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మ్యానిఫెస్టోలో ఎల్టీ, హెచ్‌టీ క్యాటగిరీ విద్యుత్ కనెక్షన్లకు కనీస విద్యుత్ చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం గొప్ప విషయమని టీఐఎఫ్ అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి, కార్యదర్శి గోపాల్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చినుంచి సెప్టెంబర్ వరకు ట్రాన్స్‌పోర్ట్ వాహనాల మోటర్ వాహన పన్ను రద్దు హామీపై సంతోషం వ్యక్తంచేశారు.
పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
కరోనా అనంతరం రజకులకు పనులు తక్కువై ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్న వేళ దోబీఘాట్లకు, లాండ్రీలకు ఉచిత విద్యుత్తును అందిస్తామని ప్రకటించడం హర్షణీయం. సీఎం కేసీఆర్ దేవుడిగా చరిత్రలో నిలిచిపోతారు. మా బాధలను గుర్తించి పెద్ద మనసుతో అడగక ముందే ఉచిత కరంటును ఇస్తామని ప్రకటించి పేదల పెన్నిధిగా నిలిచారు. రజకుల కష్టాలను గుర్తించిన ఏకైక సీఎం.. కేసీఆర్.
– ఎం నర్సింహ, తెలంగాణ రజక అభివృద్ధి సంఘం గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్
ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి
సీఎం కేసీఆర్ పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. దేవుడులాంటి సీఎంకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. సెలూన్లకు విద్యుత్ బిల్లు మినహాయింపు హర్షణీయం. కరోనా నేపథ్యంలో ప్రజలు సెలూన్‌కు రావడంలేదు. దీంతో వ్యాపారం లేక, షాపుల కిరాయి కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లును మినహాయించడం ఎంతో సంతోషకరం.
– సాయికుమార్, సెలూన్ యజమాని, నేరేడ్‌మెట్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
నీటి బిల్లు రద్దు సాహసోపేతం
మంచినీటి బిల్లును రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సాహసోపేతమైనది. ప్రతిసారీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొనే కేసీఆర్.. ఈ సారి కూడా ప్రజలంతా హర్షించదగిన నిర్ణయం తీసుకొని ప్రజాసంక్షేమానికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిరూపించారు. పేద ప్రజల సంక్షేమానికి, అభ్యున్నతికి పాటుపడుతూ సీఎం కేసీఆర్ సుపరిపాలనను అందిస్తున్నారు.
– మనోజ్‌కుమార్, తుకారాంగేట్
ఒకప్పుడు నీళ్లు రాకున్నా బిల్లు కట్టినం
ఒకప్పుడు మంచినీళ్లు రాకున్నా బిల్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ల కోసం బిందెలు పట్టుకొని వాటర్ వర్క్స్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసినం. అయినా గుక్కెడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. కానీ నీళ్ల బిల్లు వచ్చేది. ఇప్పుడు అవసరాల మేరకు నీళ్లు అందుతున్నాయి. కేసీఆర్ సార్ నీళ్లు అందిస్తూ మా కష్టాలను దూరం జేసిండు. బిల్లుగూడ మాఫీ జేసిండు.
– అన్నపూర్ణ గృహిణి (డబీర్‌పుర)
నిరుపేదల పాలిట దేవుడు
ఇరవై వేల లీటర్లలోపు మంచినీటిని వాడుకొనే నిరుపేదలందరికీ డిసెంబర్ నుంచి నీటి బిల్లులు రద్దు చేయడం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ పాలనలో నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారు.
– కే అభిరాం, విజయనగర్ కాలనీ, రంగారెడ్డినగర్
అపర భగీరథుడు
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల కోసం మస్తు గోస పడ్డం. మంచినీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి. కరంటు ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఉచితంగా మంచినీటిని పంపిణీ చేసేందుకు తీసుకున్న నిర్ణయం హర్షణీయం.
– కొంపల్లి నాగశేఖర్‌గౌడ్, ప్రసూననగర్, కుత్బుల్లాపూర్
కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడు
గతంలో పాలించినవారు ఎవరు కూడా కేసీఆర్ లాగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోలేదు. కొత్త రాష్ట్రంలో 24 గంటలపాటు కరంటు ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయమైతే.. ప్రస్తుతం ఉచితంగా మంచి నీటిని అందిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించడం మరో సాహసోపేతమైన నిర్ణయం. నగరంలో నలువైపులా బస్తీ దవాఖానలు ఏర్పాటు నిర్ణయం గొప్ప విషయం.
– మన్సూర్ అలీ, బిస్మిల్లాకాలనీ
హమ్మయ్య నీళ్ల బిల్లు తప్పుతది
మేం ఇద్దరం పనిచేస్తేనే ఇల్లు గడుస్తది. నీళ్ల బిల్లు, కరంటు బిల్లులను కట్టాలంటే వచ్చే జీతాలతో సరిపోయేది కాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చే నెల నుంచి నీళ్ల బిల్లు రద్దు చేశారు. హమ్మయ్య ఇక మాకు నీళ్ల బిల్లు తప్పుతది. కేసీఆర్ దయవల్ల మాకు నీల్ల బిల్లు చింతలేదిక. సీఎం కేసీఆర్‌కు మా దీవెనలు.
– రాధిక, కుర్మగూడ
వాహన పన్ను రద్దు మంచి నిర్ణయం
లాక్‌డౌన్‌తో వ్యాపారాలు లేక తీసుకున్న వాహనాలకు ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కరోనాతో వ్యాపార లావాదేవీలు సాగడం లేదు. వాహనాలపై పన్ను రద్దుతో వాహన యజమానుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. వాహన పన్ను రద్దు సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయం.
– రాజేష్, వనస్థలిపురం
ఈ నిర్ణయం గొప్పవరం
నీళ్ల బిల్లులు రద్దుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలపట్ల తనకున్న సహృదయాన్ని చాటుకున్నారు. చాలీచాలని ఆదాయంతో బతుకీడ్చే పేదలకు ఈ నిర్ణయం గొప్ప వరం. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల మనిషి. పేదల దీవెనెలు ఆయనకు ఎప్పుడూ ఉంటాయి. మా ఓటు కారుకే వేస్తాం.
– సునీత, అమీర్పేట్