టీ.ఆర్.ఎస్ అంటే బీ.జీ.పీ కి భయమా?:కే.టీ.ఆర్

హైదరాబాద్,తీస్మార్ న్యూస్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముషీరాబాద్‌లో బీజేపీ, ఎంఐఎంను కలిపి కొట్టాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. భోలక్‌పూర్‌లో డ్రైనేజీ కలిసిన నీళ్లు తాగి 9 మంది చనిపోయిన ఘటన మరిచిపోలేదని అన్నారు. వందేళ్ల క్రితం గండిపేట తప్ప హైదరాబాద్‌కు రిజర్వాయర్‌ లేదని గుర్తు చేశారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

‘ఐదేళ్ల కిందట మా విజ్ఞప్తిని మన్నించి 99 సీట్లతో ఆశీర్వదించారు. మీరు ఓటేసినందుకు ఏమేం చేశామో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ ట్రాఫిక్‌ గురించి ఇన్నేళ్లలో ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్‌ మనస్సున్న ముఖ్యమంత్రి. కులం, మతంతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకం కింద రూ.లక్షా నూట పదహారు ఇస్తున్నాం. ఆరేళ్లలో ఏం చేసినమో చూపిస్తాం..బీజేపీ ఒక్క పని చూపించాలని’ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

‘తెలంగాణ ఇచ్చిన పైసలతోనే వారణాసి, పాట్నా, లక్నోలో రోడ్లు వేసుకుంటున్నారు. మా పైసలు మేం అడిగితే వేర్పాటువాద ధోరణా? మేం వరదసాయం చేస్తుంటే బీజేపీ నిర్దాక్షిణ్యంగా అడ్డుపడింది. రూ.10వేల ఇస్తుంటే ఆపినోళ్లు రేపు రూ.25వేలు ఇస్తరా? మేం రూ.10వేలు ఇచ్చిన ఆరున్నర లక్షల మంది జాబితా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పంపిస్తాం. వాళ్లందరికీ బీజేపీ తలా రూ.25వేలు ఇవ్వాలని సవాల్‌ చేశారు. గల్లీలో జరిగే ఎన్నికలకు ఢిల్లీ నుంచి పెద్దపెద్దోళ్లు దిగుతున్నారు. టీఆర్‌ఎస్‌ని చూస్తుంటే బీజేపీకి భయమేస్తోందా?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.