హైదరాబాద్, తీస్మార్ న్యూస్: హైదరబాద్ లో ఎగిరేది గులాబ్ జెండానే అని రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ తేల్చి చెప్పారు. గోల్కొండపై సీఎం కే చంద్రశేఖర్‌రావు ఎప్పుడో జాతీయ జెండా ఎగరేశారని.. ఆ విషయం బీజేపీ నాయకులకు తెలియదేమోనని ఎద్దేవాచేశారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగరేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఒక విలేకరి ప్రస్తావించగా ‘గోల్కొండమీద కషాయం, కాషాయం జెండాలుండవు. జాతీయ జెండా ఒక్కటే ఉంటుంది. ఇప్పటికే దాన్ని మేము ఎగురవేశాం. ఇంకా అక్కడ ఎగురవేయడానికి ఏమీలేదు. మేమైతే బల్దియాపై గులాబీ జెండా ఎగురవేయటం ఖాయం’ అని చెప్పారు. రాజకీయాలు ఎప్పుడు నిశ్చలంగా ఉండవని, చలనశీలంగా ఉంటాయని అన్నారు. ‘టీఆర్‌ఎస్ పనిచేసింది. ప్రజలకు ఆ విషయం తెలుసు. అందుకే ప్రజల ఆదరణ మాకే ఉంటుందని చెప్తున్నాం. బీజేపీని అన్ని స్థానాల్లో పోటీ చేయమనండి చూద్దాం. ఎన్నికల్లో ఓట్లు ఎలా వస్తాయో చూద్దాం. రెండో ప్లేస్‌లో ఎవరుంటారో వారే తేల్చుకుంటారు’ అని చెప్పారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు ఇచ్చారు. ఇవీ ఆ వివరాలు..
మీరు గత బల్దియా ఎన్నికలప్పుడు టీఆర్‌ఎస్ గెలువకపోతే రాజీనామా చేస్తానని చాలెంజ్ చేశారు? ఈసారి ఎలాంటి చాలెంజ్ చేయబోతున్నారు?
ప్రతిసారీ మేమే సవాలు విసిరితే మజా ఉండదు కదా? వాళ్లు ఎవరన్నా చేస్తే.. తప్పకుండా రెస్పాండ్ అవుతాం.
లాక్‌డౌన్ తర్వాత హైదరాబాద్‌లో దాదాపు లక్షమంది ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎలా న్యాయం చేస్తారు?
లాక్‌డౌన్ తర్వాత కష్టాలు ఒక్క హైదరాబాద్‌కే రాలేదు. యావత్ దేశానికి వచ్చాయి. దానివల్ల ఆటో కార్మికులే కాదు ప్రైవేటు టీచర్లు, ఇతరులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ సమయంలో, లాక్‌డౌన్ తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసింది.
ఈ ఎన్నికల్లో మజ్లిస్‌తో అంతర్గత ఒప్పందం ఉన్నదనే ఆరోపణలపై మీ సమాధానం?
ఈ ఎన్నికల్లో మేము ఎవరితోనూ దోస్తీ చేయడం లేదు. 150 సీట్లలోనూ పోటీ చేస్తున్నాం. ముఖ్యంగా మజ్లిస్‌కు బాగా పట్టుండే పాతబస్తీలో గత ఎన్నికల్లో 5 సీట్లు గెలిచాం. ఈసారి మరో 5 అదనంగా గెలుస్తాం. అక్కడ మజ్లిస్‌ను ఓడించి మేము గెలుస్తాం. అంతేతప్ప వారితో ఎలాంటి దోస్తీ లేదు. ప్రభుత్వ పాలసీలను వారు సపోర్టు చేస్తుండవచ్చు. ఎన్నికల్లో మాత్రం మాది వ్యక్తిగత పోరాటమే. మేము కూడా అప్పుడప్పుడు కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపినం. అంతమాత్రాన వారితో కలిసిపోయినట్లని అర్థం కాదు.
దుబ్బాక గెలుపు విషయంలో మీరేమంటారు?
2014 నుంచి ప్రారంభమైన ప్రస్థానం వేరు. అంతకు ముందు మేము 10-12 ఎన్నికల్లో కొట్లాడాం. దురదృష్టం ఏమిటంటే ఈరోజు.. మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్క మనిషిని కరిస్తే వార్త. అదేవిధంగా టీఆర్‌ఎస్ గెలుపు వార్త కాదు.. టీఆర్‌ఎస్ అపజయమే ఇప్పుడు వార్త. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో గెలుస్తాం.
వరద సాయం రూ.550 కోట్ల వరకు ఇచ్చామని చెప్తున్నారు. ఇందులో కేంద్రం వాటా కూడా ఉన్నదని బీజేపీ నేతలు అంటున్నారు!
చెప్పినవారికి కామన్‌సెన్స్ లేదు. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ ఏం చెప్పారంటే.. ‘కేంద్రం అంటే మిథ్య’ అన్నారు. ఆరేండ్లుగా తెలంగాణ ప్రజలు రూ.2.72 లక్షల కోట్లను పన్నుల ద్వారా చెల్లిస్తే అందులో రూ.1.40 లక్షల కోట్లను మాత్రమే కేంద్రం రాష్ర్టానికి ఇచ్చింది. సొమ్ము తెలంగాణది.. సోకు ఢిల్లీది. తీసుకున్నది తప్ప.. ఇచ్చింది ఎక్కడ? వరద సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి లేఖ రాసిన నాలుగు రోజుల్లోనే రూ.600 కోట్లు విడుదలచేశారు. అదే తెలంగాణ సీఎం లేఖ రాసి ఆరు వారాలు గడిచినా ఉలుకుపలుకు లేదు. వీరా మాట్లాడేది? రూపాయి రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతుంటే.. ఆఠానా కూడా రావడం లేదే? తెలంగాణ నుంచి లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళుతున్న వివరాలను లెక్కల రూపంలో ఇస్తా.. వాటిని చూసి చెప్పండి ఎంత వరకు వాస్తవమో! హైదరాబాద్‌కు మేము ఏం చేశామో చూపిస్తాం. వారిని చూపించమనండి. కేంద్రం చేసిన ఒక్క పనిని చెప్పమనండి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్తారా? ఇంకెవరైనా చెప్తారా.. చెప్పమనండి. దేశంలో తెలంగాణ అంతర్భాగమే కదా! మరి ఎందుకు కేంద్రప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు?
ఫార్మాసిటీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి?
ఫార్మాసిటీ విషయంలో రాజకీయంగా కొన్ని అడ్డంకులున్నాయి. అయినా అక్కడి ప్రజల అంగీకారంతోనే ఫార్మాసిటీ నిర్మిస్తాం. తద్వారా వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దానికి కొంత సమయం పడుతుంది. గ్రీనరీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటి గ్రీనరీ పెంచుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం యేటా పెట్టే బడ్జెట్‌లోనే 10% గ్రీనరీ కోసం కేటాయిస్తున్నది. వాతావరణ మార్పులు, కాలుష్యంపై మేం ప్రత్యేకంగా పనిచేస్తున్నాం. అందుకే కాలుష్యకారక పరిశ్రమలను నగరం నుంచి బయటకు తరలించి, నగరంలో పరిశ్రమల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం.
కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కట్టాలంటే ఇబ్బందులు కాదా?
ఎల్‌ఆర్‌ఎస్ ఒక్క హైదరాబాద్‌లోనే చేసినమా? కరోనా విషయంలో ఇబ్బంది పడుతున్నారని హైదరాబాద్‌లోనే ట్యాక్స్ తగ్గించినమా.. రాష్ట్రంలోని 141 మున్సిపాల్టీల్లో తగ్గించినమా? మొత్తం తగ్గించినం కదా! అట్లాంటప్పుడు రాష్ట్రంలోని 141 మున్సిపాల్టీల్లో ఎన్నికలు లేవుగా! 130 మున్సిపాల్టిలకు ఎలక్షన్లు జరిగాయి. అందులో 125 చోట్ల టీఆర్‌ఎస్ గెలిచింది.
గత ఎన్నికల్లో మీరు ఒంటిచేత్తో 99 సీట్లు సాధించి.. మున్సిపల్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. ఇప్పుడు విజయం సాధిస్తే ఏమవ్వబోతున్నారు?
నేను ఒక్కడినే 99 సీట్లు గెలిపించాననటం తప్పు. అలాంటి భ్రమలు, అపోహలు కూడా లేవు. మావాళ్లు అందరూ డివిజన్ డివిజన్ తిరిగి కష్టపడితే.. ప్రజల ఆశీర్వాదంతో గెలిచామే తప్ప.. నేనేదో గెలిపించాననటం తప్పు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బ్రహ్మాండంగా దూసుకుపోతున్నది. ఇప్పుడన్నా, అప్పుడన్నా ఆయన ఇచ్చిన అవకాశం పెద్దది. సంతృప్తిగా ఉన్నా. ఇంతకన్నా నాకేమొద్దు. నేను బ్రహ్మాండంగా, హ్యాపీగా ఉన్నా. నువ్వు కూడా హ్యాపీగా ఉండు.
ఆరేండ్లుగా రూపాయి పన్ను పెంచలేదంటున్నారు.. మరి ఆదాయ మార్గాలు ఎట్లా?
ఒక్కటైతే పక్కాగా చెప్తా. ఒకవేళ నేను చేయలేకపోతే చేయలేదని చెప్తాను. పేదలకు నష్టం జరుగదనే చెప్పాను. చేయగలిగేవి, చేసేటివే చెప్తాం. చేయలేనివి చెప్పం. చెప్పనివి కూడా చేస్తాం. మేము అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు వాళ్లు 2 లక్షలు రుణమాఫీ అన్నారు. పోటీ.. వేలం పాటలా మేం పోలేదు. చేయగలిగిందే చెప్పినం. పెద్దలున్నారు.. ప్రభుత్వం ఉన్నది.. ముఖ్యమంత్రి ఉన్నారు. వారు చూసుకుంటారు భవిష్యత్తులో ఎట్లా చేయాలన్నది. పరిపాలన నాకంటే.. మీకంటే బాగా వారికి తెలుసు.
ఈ ఎన్నికల్లోనూ మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తారా?
మొన్ననే దీపావళి అయిపోయింది. తర్వాత కార్తీక పౌర్ణమి ఉన్నది. అన్ని పటాకులు ఒకేసారి కాల్చొద్దు.
వరద సహాయం నిలిపివేశారు కదా.. సడలింపులు ఉంటాయా?
వరద సహాయం ఎస్‌ఈసీ నిలిపివేసింది. కాంగ్రెసోళ్లో.. బీజేపోళ్లో వరద సహాయంతో టీఆర్‌ఎస్‌కు లబ్ధి కలుగుతుందని ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. ఇంతకు ముందు కూడా చెప్పాను. అర్హులైన ప్రతి ఒక్కరికీ వరద సహాయం అందుతుంది. అందులో ఎలాంటి అనుమానాల్లేవు. సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. రూ.550కోట్లు కాకపోతే ఇంకో వంద కోట్లు అయినా కేటాయిస్తారు. అర్హత ఉన్నవాళ్లందరికీ వరద సహాయం అందుతుంది.
కాంగ్రెస్‌ను మీరు బలహీనపర్చడం ద్వారానే బీజేపీకి బలం చేకూరిందనే చర్చ జరుగుతున్నది..
కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే బీజేపీకి ‘బీ టీమ్’ అంటారు. అదే బీజేపీ నాయకులు మాట్లాడితే కాంగ్రెస్‌కు ‘బీ టీమ్’ అంటారు. హమ్ కిసీకే బీ టీమ్ నహీ. హమ్ తెలంగాణ అవామ్‌కీ ‘ఏ టీమ్’. తెలంగాణ అవామ్ కీ సాత్ జిందగీ గుజర్హ్రీ హై. కాంగ్రెస్ బలహీన పడ్డది అంటే.. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం.
జీహెచ్‌ఎంసీలో గెలిపిస్తే ఎల్‌ఆర్‌ఎస్ తీసేస్తామని బీజేపీ వాళ్లు చెప్తున్నారు.. మీరు దానిపై నిర్ణయం తీసుకుంటారా?
ఎట్లా తీస్తారో అదికూడా చెప్తే బాగుంటది కదా? రాష్ట్రంలో అధికారంలో మేం ఉన్నాం. తీస్తేగీస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయాలి. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2015లో ఏ జీవో అయితే తెచ్చిందో.. అదే జీవోను యథాతథంగా ఇచ్చాం. అప్పుడులేని అభ్యంతరం వీళ్లకు ఇప్పుడెందుకు? ఎల్‌ఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. దాని పరిధిలో ఉంటుంది. పేద ప్రజలకు భారం పడకూడదని చేశాం. చెప్పేటోనికి బుద్ధిలేకున్నా.. మనకు వినేటోళ్లకి ఉండాలి కదా! ‘ఏదిపడితే అది చెప్తాం.. నమ్మబలుకుతం.. ఒక అబద్ధం.. వంద అబద్దాలు చెప్తాం.. నిజమవుతుంది..’ అనే పిచ్చి ప్రచారాలు ఇంకెక్కడనో నడవొచ్చుగానీ.. హైదరాబాద్‌లో నడువది. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో వాళ్లు ఏం తీసుకుంటారు నిర్ణయం? అవసరమైతే ఆ దిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. పాపం వాళ్లు (బీజేపీ) ఎన్ని ఆశలు పెట్టుకున్నా అడియాసలవుతాయి.
వరదసాయం విషయంలో ప్రభుత్వం సరిగా చేయడంలేదనే ఆరోపణలున్నాయి!
104 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసింది. 1916లో 1400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మళ్లీ ఇప్పుడు అదేస్థాయిలో హైదరాబాద్‌లో కురిసింది. వర్షాలనేవి మనకు ఎప్పుడూ చెప్పి రావు. అయి నా మేము వరద వచ్చిన ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంతోపాటు లక్షలమందికి ఆర్థిక సాయం అందించాం. వందేండ్లకోసారి వచ్చే ఇలాంటివాటి కోసం ఎవరూ సిద్ధంగా ఉండరు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో వరదలకు ఎన్నో ప్రాంతాలు నీట మునిగాయి. ఆ సమయంలో 28వేల ఆక్రమణలు నాలాల్లో ఉన్నాయని కిర్లోస్కర్ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి ప్రభుత్వాలు ఆ నివేదిక ప్రకారం ఏమీ చేయలేకపోయాయి. 2 సెంటీమీటర్ల వర్షం కురిసినా తట్టుకొనే పరిస్థితి నగరానికి లేదు. ఇప్పటికే వరద బాధితులకు రూ.550 కోట్ల వరకు సాయం అందించాం. వీరిలో 6 లక్షల మంది జీహెచ్‌ఎంసీ ప్రజలతోపాటు శివారు మున్సిపాలిటీలకు చెందినవారు ఉన్నారు. మాపై ఆరోపణలు చేస్తున్నవారు హైదరాబాద్ నగరంలో చేసిన ఒక్క పనిని చూపించమనండి. మేము మాత్రం 100 చూపిస్తాం. కేంద్రంలో అధికారంలో ఉన్న వారి ప్రభుత్వం నగరంలోని కంటోన్మెంట్‌లో రోడ్లను బ్లాక్‌చేసి ప్రజల రాకపోకలను అడ్డుకున్నది.
వరదలు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ రాలేదని, పట్టించుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి!
వరద ప్రాంతాలకు బండి సంజయ్ ఏమైనా వచ్చిండా? సీఎం కేసీఆర్ పట్టించుకోకపోతేనే వరద బాధితులకు రూ.550 కోట్లు వచ్చాయా? కామన్‌సెన్స్ లేకుండా మాట్లాడుతయి ప్రతిపక్షాలు. ఇంకా అందనివారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పాం. ఎన్నికల కారణంగా వర ద సాయాన్ని ఆపేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో అర్హులైనవారికి ఎన్నికల తర్వాత ఇస్తామని సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. వరదల సమయంలో పదిమంది మంత్రులం మోకాళ్ల లోతు నీళ్లున్న ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శించి, అన్ని విధాలుగా ఆదుకున్నం.