బల్ధియా పీఠం గులాబీ సొంతం

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అతిపెద్ద పార్టీగా అవతరించింది.శుక్రవారం జరిగిన కౌంటింగ్ లో తెరాస 56,బీ.జే.పీ 48,ఎం.ఐ.ఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచాయి.అతిపెద్ద పార్టీగా నిలిచిన టీ.ఆర్.ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఆద్యంతం ఉత్కంఠ

150 డివిజన్లకు 30 సర్కిళ్లలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు ఉత్కంఠగా సాగింది. ప్రత్యర్థుల మధ్య పోల్‌ అయిన ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండటంతో ఫలితాల సరళి క్షణక్షణం మారుతూ వచ్చింది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. 150 డివిజన్లలో పోలైన 1200 ఓట్లలో మెజార్టీ ఓట్లు బీజేపీకి వచ్చాయి. ఆ తర్వాత తొలి రౌండ్‌ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 85 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించారు. దాదాపు 25 స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌, 40 స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యం చూపాయి. రెండో రౌండ్‌ కౌంటింగ్‌ మొదలయ్యేసరికి ఫలితాల సరళి అనూహ్యంగా మారుతూ వచ్చింది. టీఆర్‌ఎస్‌-బీజేపీ అభ్యర్థుల మధ్య చాలా డివిజన్లలో నువ్వానేనా అన్నట్లు హోరాహోరీ పోరు సాగింది. క్షణక్షణం ఆధిక్యాలు మారుతుండటంలో  ఉత్కంఠ పెరిగిపోయింది. సాయంత్రం 7.30 గంటలకు 149 డివిజన్లలో ఫలితాలు వెల్లడికాగా.. 55 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి గ్రేటర్‌లో అతిపెద్ద పార్టీగా తన ఆధిక్యతను మరోసారి కొనసాగించింది. ఫలితం వాయిదాపడిన నేరేడ్‌మెట్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. తుది ఫలితం వెలువడితే ఈ స్థానం కూడా గులాబీదళం ఖాతాలోకే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 17 సీట్లు స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ చేజారిపోయాయి. పాతబస్తీలో ఎంఐఎం తన ఉనికిని కాపాడుకోగలిగింది ఎగ్జిట్‌పోల్స్‌లో 25-30 కి మించి రావడం గగనమనుకొన్న బీజేపీ.. తానే ఊహించని స్థాయిలో 48 డివిజన్లలో విజయం నమోదుచేసింది. ఈ ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని చవిచూసింది మాత్రం కాంగ్రెస్‌ పార్టీనే. 149 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ పార్టీ.. కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. ఇక 106 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ అభ్యర్థులు ఒక్కటంటే ఒక్క సీటులో కూడా కనీసం డిపాజిట్‌ దక్కించుకోలేకపోయారు. మొదట మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడవుతాయని ఊహించినప్పటికీ.. బ్యాలెట్‌ పత్రాలు కట్టలు కట్టి.. కౌంటింగ్‌ మొదలుపెట్టేసరికి కొంత జాప్యం జరిగింది.

మరోసారి పీఠంపై టీఆర్‌ఎస్‌..!

బల్దియా ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే గత ఎన్నికలు మినహా ఎప్పుడూ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 99 స్థానాలు గెలుచుకున్నది. బల్దియా చరిత్రలో ఒక పార్టీ సొంతగా అధికారంలోకి రావడం అదే రికార్డు. ఈసారి ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచిన టీఆర్‌ఎస్‌.. వరుసగా రెండోసారి బల్దియా పీఠంపై కూర్చునే అవకాశాలు ఉన్నాయని అంచనావేస్తున్నారు. ప్రస్తుత పాలక వర్గం ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే కొత్త మేయర్‌ ఎన్నికకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నది.

ఎక్స్‌ అఫీషియోలు కీలకం

150 స్థానాలు ఉన్న జీహెచ్‌ఎంసీలో మేయర్‌పీఠం దక్కించుకోవడానికి కనీసం 76 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకొంటారు. అప్పటికే వేరే స్థానిక సంస్థల పరిధిలో ఎక్స్‌ అఫీషియోగా నమోదుకాని.. ఓటు వేయనివారికి మాత్రమే నమోదు చేసుకొనే అవకాశముంటుంది. దీంతోపాటు జీహెచ్‌ఎంసీలో నివసిస్తూ ఓటరుగా నమోదైఉన్నవారికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు మొత్తం 45 మందికి ఎక్స్‌ అఫీషియోగా నమోదుచేసుకోవడానికి అర్హత ఉన్నది. మేయర్‌ ఎన్నిక సమయంలో ఈ ఎక్స్‌ అఫీషియో ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకొంటారు.  ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 31 మంది, ఎంఐఎంకు 10 మంది, బీజేపీకి ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన టీఆర్‌ఎస్‌కు 87, బీజేపీకి 50, ఎంఐఎంకు 54 మంది సభ్యుల బలం ఉన్నట్టవుతుంది.

అర్థ్ధంకాని ఓటరునాడి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను చూసి రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయంచెందారు. ఎంఐఎం కచ్చితంగా 40 వరకు స్థానాలు గెలుచుకుంటుందని, తన కోటను పదిలం చేసుకొంటుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టే మైనార్టీ ఓటుబ్యాంకు అధికంగా ఉన్న 44 సీట్లలో గెలుపొందింది. ఎంఐఎం తనకు గత ఎన్నికల్లో లభించిన సీట్లను పదిలపర్చుకోగలిగింది. మిగతాస్థానాల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీలు పోటీ పడ్డాయి. టీఆర్‌ఎస్‌ మొదటి నుంచీ అభివృద్ధి నినాదాన్నే నమ్ముకోగా, బీజేపీ సంచలనాలను నమ్ముకొన్నది. మంత్రి కేటీఆర్‌ సహా ఇతర మంత్రులు, నేతలు టీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. బీజేపీ నేతలు సంచలన, విద్వేషపూరిత వ్యాఖ్యలు, కేంద్ర హోంమంత్రి సహా జాతీయస్థాయి నాయకుల ప్రచారంతో హడావుడిచేశారు. ఆఖరుకు ప్రధాని మోదీ సైతం కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి తీరును పరిశీలించే పేరిట హైదరాబాద్‌కు వచ్చి మీడియాకు చేతులూపి వెళ్లారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ సొంతంగా మెజార్టీ సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనావేశాయి. కానీ.. అంచనాలు తలకిందులు చేస్తూ హైదరాబాద్‌ ఓటర్లు ఎవరికీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దీంతో అన్ని పార్టీలు ఫలితాలను విశ్లేషిస్తున్నాయి.

తీన్‌మార్‌

  • సంగారెడ్డి జిల్లాలోని 3 డివిజన్లలో గులాబీ హవా
  • భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరుల్లో భారీ మెజార్టీ 

సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలోనూ గులాబీ గుబాళించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ఈ మూడు డివిజన్లలో 4 నుంచి 6వేలకు పైగా ఓట్ల మెజార్టీ టీఆర్‌ఎస్‌కు వచ్చింది. ఈ మూడు డివిజన్లకు మంత్రి హరీశ్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్‌, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, చింతా ప్రభాకర్‌, పార్టీ నేతలు బక్కి వెంకటయ్యతోపాటు సిద్దిపేట, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్‌, అందోలు పార్టీ ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. భారతీనగర్‌-111 డివిజన్‌లో సింధూ ఆదర్శ్‌రెడ్డి 4,658, రామచంద్రాపురం-112లో పుష్పానగేశ్‌ 5,759, పటాన్‌చెరు-113లో 6,082 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నాయి.