ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే మిగిలి ఉండటంతో పార్టీలు జోరు పెంచాయి. వాతావరణం చల్లగా మారినా ప్రచార వేడి మాత్ర జోరందుకున్నది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు క్యాంపెయిన్ ముగియనుండటంతో అభ్యర్థులు ఈ కీలక సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. ప్రచారంతోపాటు బహిరంగసభలు, రోడ్‌షోలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు కాలనీలు, బస్తీ లు చుట్టేసి వచ్చిన అభ్యర్థులు ప్రస్తుతం ముఖ్యనేతలతో కలిసి రోడ్‌షోలపై దృష్టి సారించారు. అగ్ర నేతలను వెంటబెట్టుకొని ప్రచార జోరును పెంచారు. అగ్ర నేతలంతా నగరంలో మకాం వేసి ప్రచారం చేస్తుండటంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
ప్రచారంలో గులాబీపార్టీ అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. గడిచిన దాదాపు పది రోజులకు పైగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో ఉండటం, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మెజార్టీ నియోజకవర్గాల్లో రోడ్‌షోల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ప్రచారంలో కారు జోరు కొనసాగుతున్నది. వివిధ సంఘాల నేతలతో సమావేశాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ వారీ మద్దతును కూడగట్టారు. తొమ్మిది నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నీ తానై రోడ్‌షోల ద్వారా క్యాడర్‌లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు. ప్రచారంలో చివరి రోజైన ఆదివారం గోషామహల్, సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో మంత్రి కేటీఆర్ రోడ్ షోతో హోరెత్తించనున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున సీఎం కేసీఆర్ శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
content source”ntnews.com”