- ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి
- ఎన్నికల కమిషన్‌కు సీపీ సజ్జనార్ సూచన
ఓటు హక్కు వినియోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలని, అప్పుడే ఓటు విలువ తెలిసి వస్తుందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎ్‌సలతో కలిపి భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం గ్రేటర్ ఎన్నికలకు జరిగిన పోలింగ్‌లో అతితక్కువ మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడంతో చాలా ఆవేదన వ్యక్తం చేసిన సీపీ..
ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఓటు వజ్రాయుధం వంటిది. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటు వేసి ప్రజా స్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి బాధ్యతను మర్చిపోయిన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలన్నారు. ఓటు వేసిన వారికి ఎక్కువ బెనిఫిట్స్, టాక్స్ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
”దేశానికి ప్రజాస్వామ్యం వచ్చి 80 ఏళ్లు గడుస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. కానీ ఓటర్లు మాత్రం ఓటేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దానివల్ల కోట్లలో ప్రజా ధనం వృథా అవుతోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.