బీజేపీ నయా నాటకం

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ నిన్నటిదాకా విద్వేశాలను రెచ్చగొడుతూ, ఒక వర్గంవారి ఓట్లను రాబట్టడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ, జాతీయ నేతలను హైదరాబాద్‌ గల్లీల్లో తిప్పితూ ఓటర్లను తమవైపు ఆకర్షించడానికి ప్రయత్నించారు. ప్రచారపర్వం ముగియడంతో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఆ పార్టీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. తాజాగా ఓటర్ల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి కమలం పార్టీ కొత్త నాటకాలకు తెరతీసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యహరిస్తున్నదని, ప్రభుత్వానికి అనుకూలంగా పనుచేస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు ఎస్‌ఈసీ కార్యాలయం ఎదుట హంగామా సృష్టించారు. ఎస్‌ఈసీ, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల కార్యాలయంలోకి దూసుకెళ్లేందు ప్రయత్నించారు. కార్యాలయం ఆవరణలో గలాటా సృష్టించారు. బీజేపీ నేతల ధర్నాతో ఎన్నికల కమిషన్‌ ఆఫీస్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ నేతలు రఘునందన్‌ రావు, రాంచందర్‌రావు, నల్లు ఇంద్రసేనా రెడ్డితోపాటు పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.