అగ్రహీరో, అక్కినేని నట వారసుడు నాగార్జునపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి నోరు పారేసుకున్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షో హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షో ముగిసింది. ఈ నేపథ్యంలో హోస్ట్‌గా మహిళలను కించపరిచేలా నాగార్జున వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. తిరుపతిలో ఆదివారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ నాగార్జునపై ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మీడియాతో నారాయణ ఏం మాట్లాడారో తెలుసుకుందాం.నాగార్జున సినిమాలు చూస్తుంటానని, ఆయన నటన అంటే అభిమానమని ఆయన చెప్పుకొచ్చారు. కానీ బిగ్‌బాస్ షోలో హోస్ట్‌గా నాగార్జున దరిద్రపు పనులు చేశారని నారాయణ ఘాటు విమర్శలు చేశారు. బిగ్‌బాస్ షోలో ముగ్గురు యువతుల ఫొటోలు పెట్టి, ఒక యువకుడిని ఎవర్ని కిస్ చేస్తావు? ఎవరితో డేటింగ్ చేస్తావు? ఎవర్ని పెళ్లి చేసుకుంటావని బహిరంగంగానే నాగార్జున అడిగారన్నారు. ఇదే విధంగా తన కుటుంబంలోని మహిళా నటుల ఫొటోలు పెట్టి అడగ్గలడా? అని నాగార్జునను నారాయణ సూటిగా ప్రశ్నించారు.పద్ధతిగా ఉన్న నాగార్జున ఎందుకిలా చేస్తున్నాడని ఆయన నిలదీశారు. ఈ విషయమై కిందిస్థాయి కోర్టుల్లో కేసులు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు కూడా భయపడుతుంటే తామేం చేయాలని ఆయన నిర్వేదంతో ప్రశ్నించారు. మనది పితృభూమి కాదని, మాతృభూమి అని, మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నారాయణ ప్రశ్నించారు. నటులెవరైనా ఇలా దిగజారి ప్రోగ్రాంలు చేయొద్దని ఆయన హితవు చెప్పారు. ఈ షోపై త్వరలో హైకోర్టులో కేసు వేస్తానన్నారు. ఎంత వరకైనా పోరాడుతానని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు సమాజానికి నాగార్జున క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
