రజనీకాంత్ నిర్ణయానికి చిరంజీవి కారణమా?

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఉన్నట్టుండి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో అభిమానులు షాకయ్యారు.   ఆయనను నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఎటు వెళ్ళాలో కూడా తెలియని ప‌రిస్థితుల్లో ఉన్నారు.   నిన్న మొన్నటి వరకు కూడా రజినీకాంత్ దగ్గర ఉన్న వాళ్లు ఇప్పుడు అయోమ‌యంలో ప‌డ్డారు. అనారోగ్యం కారణంగా తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతున్నట్లు ప్రకటించాడు సూపర్ స్టార్. ఈ సమయంలో ఒత్తిడి మంచిది కాదని వైద్యులు తనకు సూచించినట్లు చెప్పాడు.. దయచేసి తన పరిస్థితి అర్థం చేసుకోవాలని విన్నవించుకున్నాడు. తనను నమ్మి ఇన్ని రోజులు తనతో పాటు ప్రయాణించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే రజినీకాంత్ రాజకీయాల నుంచి ఇంత త్వరగా తప్పుకోవడానికి కారణం కేవలం ఆయన అనారోగ్యం మాత్రమే కాదు.. టాలీవుడ్ హీరో చిరంజీవి కూడా అని తెలుస్తోంది.చాలా రోజుల నుంచి కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే చిరంజీవి అంతర్గతంగా వద్దు అని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ లాంటి వాళ్లకు రాజకీయాలు సరిపోవని చిరంజీవి కేవలం రజనీకాంత్ కు మాత్రమే కాదు ఇంకా చాలా మంది హీరోలకు చెబుతున్నాడు. పదేళ్లకు పైగా తాను రాజకీయాల్లో ఎంతో నేర్చుకున్నానని.. మరెంతో నరకం కూడా చూశాను అని ఈ మధ్యే చెప్పాడు మెగాస్టార్. సినిమాలో ఉన్నప్పుడు రాజులా ఉన్న వాళ్ళకు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. అప్పటి వరకు ప్రశంసలు తప్ప విమర్శలు తెలియని వాళ్లకు పొలిటికల్ గాలి తగలగానే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత రజనీకాంత్ కు చిరంజీవి రాజకీయాలు వద్దు అని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఇప్పుడు పరిస్థితులు కూడా బాగోలేకపోవడంతో సూపర్ స్టార్ కూడా సరే అని సమాధానం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవితో పాటు రజినీకాంత్ ప్రాణ స్నేహితుడు మోహన్ బాబు కూడా నో పాలిటిక్స్ అని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు అత్యంత ఆప్తులైన ఇద్దరు స్నేహితులు చెప్పడంతో రజనీకాంత్ కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా కూడా రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా జరగడం కొందరు అభిమానులను బాధ పెడుతున్నా .. మరికొందరు మాత్రం హ్యాపీగా ఉన్నారు.