పవన్ పై బాబు ముద్ర చెరిగిపోదా..?

నానీలపై నోరు పారేసుకున్న పవన్ కల్యాణ్ కి.. మంత్రులు బాగానే గడ్డి పెట్టారు. పనిలో పనిగా పవన్ కల్యాణ్ తో కలిపి చంద్రబాబుకి కూడా చాకిరేవు పెట్టారు. ఇద్దరినీ కలిపి ఉతికి ఆరేశారు. సీఎం జగన్ కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సొంత పుత్రుడు, దత్త పుత్రుడు అంటూ చంద్రబాబుని ప్రస్తావించారు. టోటల్ గా వైసీపీ విమర్శల్లో.. పవన్ ని ఇంకా బాబు ఏజెంట్ గానే పరిగణించడం హైలెట్ గా మారింది.మంత్రి కొడాలి నాని, పవన్ కల్యాణ్ ని చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని మాట్లాడే ప్యాకేజీ స్టార్ అంటూ మండిపడ్డారు. విడతల వారీగా చిడతలు వాయించే చిడతల నాయుడంటూ మరో మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఎంతమందికి వాయించినా, బాబుకి మాత్రం పర్మినెంట్ గా వాయిస్తారంటూ సెటైర్లు వేశారు.చంద్రబాబు హయాంలో లేవని నోరు, ఇప్పుడెందుకు లేస్తోందని, ఆయనతో పవన్ కి లాలూచీ ఏంటని ప్రశ్నించారు మంత్రి మేకపాటి. పవన్ పర్యటన సినిమా ప్రమోషన్ లా ఉందని, ఆయన వకీల్ సాబ్ కాదు పకీర్ సాబ్, బాబు ఏజెంట్ అంటూ మండిపడ్డారు మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.వీటన్నిటికీ సీఎం జగన్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ బాగుంది. పండ్లు ఇచ్చే చెట్లపైనే రాళ్లు వేస్తుంటారని, నివర్ నష్టపరిహారం ప్రకటిస్తున్నామని తెలిసి చంద్రబాబు తన పుత్రుడుని, దత్త పుత్రుడిని రంగంలోకి దించారని ఎద్దేవా చేశారు. రైతు కోసం అంటూ పుత్రుడు లోకేష్ జనాల్లోకి వస్తే, రైతుల తరపున అర్జీ ఇవ్వడానికి దత్త పుత్రుడు పవన్ బైటకొచ్చారని అన్నారు. టోటల్ గా చంద్రబాబుని, పవన్ ని ఒకే గాటన కట్టేసి ఇరుకున పెట్టారు.

పవన్ పై బాబు ముద్ర చెరిగిపోదా..?

చంద్రబాబు చేసిన పాపాలు, పవన్ కి శాపాలుగా మారి నీడలా వెంటాడుతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు బాబుని సపోర్ట్ చేసిన పవన్, ఆ తర్వాత పాలన పక్కదారి పట్టినా పట్టించుకోలేదు. తీరా ఎన్నికల ముందు బాబుతో విభేదించి, కేవలం వైసీపీ ఓట్లు చీల్చేందుకే సోలో పర్ఫామెన్స్ ఇచ్చారు. ఆ ప్రయోగం వికటించి చంద్రబాబు, పవన్ ఇద్దరూ బొక్క బోర్లా పడ్డారు.దీంతో ఇప్పటివరకూ ఇద్దరూ వేర్వేరు అన్నట్టు కలరింగ్ ఇస్తూ వచ్చారు. బాబు వామపక్షాలను వెంటేసుకోగా.. పవన్ బీజేపీతో తిరిగి జతకట్టారు. అయితే బాబు, పవన్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే ఆయన జగన్ ని మాత్రమే టార్గెట్ చేసుకుని విమర్శిస్తుంటారనే ప్రచారం ఉంది.ఇది ప్రచారం కాదని, ఇద్దరూ ఒకటేనంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పవన్ ని ఒంటరిగా టార్గెట్ చేయకుండా.. బాబును కూడా కలిపి టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నేతలు తనను తిట్టినందుకు కాదు, తనని బాబు ఏజెంట్ అని చెప్పినందుకే పవన్ ఎక్కువ బాధ పడుతున్నారు. బాబు నీడ నుంచి బైట పడలేక, లోపాయికారీ ఒప్పందాన్ని బైట పెట్టుకోలేక సతమతమవుతున్నారు జనసేనాని.