మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సీనియర్ నాయకుడు, రెబెల్‌ రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన చివరకు ప్రభుత్వంనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీకి భారీ షాక్‌ తగిలినట్టయింది. గురువారం కీలక పదవికి రాజీనామా చేసిన ఆయన తాజాగా మంత్రి పదవికి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన సీఎంకు శుక్రవారం ఒక లేఖ రాశారు. తన రాజీనామాను వెంటనే అంగీకరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నిబద్ధత, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేశానని లేఖలో పేర్కొన్నారు.

కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోమారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న మమతా బెనర్జీకి అసమ్మతి సెగ భారీగానే తగులుతోంది. క్లిష్ట సమయంలో పెనుసవాళ్లు ఎదురవుతున్నాయి. అండగా ఉండాల్సిన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో జరిగిన కేబినెట్‌ సమావేశానికి ఐదుగురు మంత్రులు గైర్హాజరు కావడం టీఎంసీలో కలవరం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు గత కొన్ని వారాలుగా అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న అధికారి గురువారం హూగ్లీ రివర్ బ్రిడ్జ్ కమిషన్‌ చైర్మన్ పదవినుంచి తప్పుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ్ బెనర్జీని కొత్తగా నియమించింది. దీంతో తృణమూల్‌ కాంగ్రెస్‌లో తాజా తిరుగుబాటు చర్చనీయాంశంగా మారింది.