మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌పై భూమా బంధువులు, కుటుంబ సభ్యులు ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక వివిధ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని అంశాలను ప్రస్తావిస్తూ …ముందు మన బంగారం మంచిదైతే ఇతరులను నిందించాల్సిన అవసరం ఏమొస్తుందని వారంతా ప్రశ్నిస్తున్నారు.వివిధ మీడియా సంస్థలతో భూమా మౌనిక మాట్లాడుతూ …. “మా అక్క , మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విషయంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. మూడు నెలలుగా అక్క ఆరోగ్యం చాలా సెన్సిటివ్‌గా ఉంది. ఆమె ప్రస్తుతం గర్భవతి. గతంలో తలకు దెబ్బ తగలడంతో, అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. గాంధీ ఆస్పత్రిలో అక్క కళ్లు తిరిగి పడిపోయినా పట్టించుకోలేదు. పైగా ఫిట్‌గా ఉందని, తీసుకెళ్లండని పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారు. అఖిలప్రియ విషయంలో ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.కానీ భూమా బంధుమిత్రులు, ఇతర కుటుంబ సభ్యుల వాదన అందుకు భిన్నంగా ఉంది. ఆడపిల్లలను జైళ్లకు పంపే సంప్రదాయం ఎక్కడా లేదంటున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే …ఆ ఇంట్లోని మగవాళ్లు చివరికి ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరని చెబుతున్నారు. అలాంటిది మూడు నెలల గర్భవతి అయిన భార్యను ఒంటరిగా వదిలేసి, తాను క్షేమంగా ఉండడానికి పరారీ అయ్యాడని భార్గవ్‌పై మండిపడుతున్నారు.అక్క ఆరోగ్యం సెన్సిటివ్ అనే విషయం మౌనిక కంటే, ఆమె భర్త అయిన భార్గవ్‌రామ్‌కు ఇంకా బాగా తెలిసి ఉంటుందన్నారు. అలాంటప్పుడు భార్యను విడిచి పెట్టి వెళ్లడానికి భార్గవ్‌రామ్‌కు మనసు ఎలా ఒప్పిందనే ప్రశ్నలు భూమా వర్గం నుంచి వస్తున్నాయి. కేవలం భార్గవ్‌రామ్‌ను రప్పించుకునేందుకే అఖిలను పోలీసులు అరెస్ట్ చేశారని వారు చెబుతున్నారు. పోలీసులకు లొంగిపోతే ఏమవుతుందని, ఆ మాత్రం ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేనప్పుడు అనవసరంగా తమ ఆడబిడ్డను కిడ్నాప్ రొంపిలోకి ఎందుకు దింపాడని భార్గవ్‌రామ్‌ను నిలదీస్తున్నారు. భార్గవ్‌రామ్ చేష్టల వల్ల తామంతా తలెత్తుకుని తిరగలేని దుస్థితి వచ్చిందని భూమా కుటుంబ సభ్యులు, బంధువులు ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికైనా కనీసం అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా, పోలీసులకు లొంగిపోయి సహకరించాలని వారంతా కోరుతున్నారు.
