డీఎంకేకు చీఫ్ స్టాలిన్ కాదు….ప్ర‌శాంత్ కిషోర్ అస‌లు బాస్

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించి టీడీపీ చేత ఎన్నిక‌ల‌కు ముందు నుంచినే విమ‌ర్శ‌ల‌కు గురైన పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టు ప్ర‌శాంత్ కిషోర్ ఇప్పుడు మ‌రో పార్టీకి త‌ల‌నొప్పిగా మారాడు. ఈ సారి అన్నాడీఎంకే వాళ్లు పీకే పై విరుచుకుప‌డుతున్నారు. కొన్నాళ్లుగా ప్ర‌శాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ త‌మిళ‌నాట డీఎంకేకు సేవ‌లు అందిస్తూ ఉంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పీకే ప‌ని చేసిన నేప‌థ్యంలో.. ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిశీలించి డీఎంకే నేత స్టాలిన్ లేట్ చేయ‌కుండా పీకేను త‌మ వ్యూహ‌క‌ర్త‌గా మార్చుకున్నాడు. డీఎంకే కోసం ఐప్యాక్ ప‌ని చేస్తూ ఉంది. ఈ ప‌రిణామాల‌పై అన్నాడీఎంకే స్పందిస్తోంది. డీఎంకేకు చీఫ్ స్టాలిన్ కాదు అని, ఆ పార్టీకి ప్ర‌శాంత్ కిషోర్ అస‌లు బాస్ అంటూ.. అన్నాడీఎంకే ఎద్దేవా చేస్తూ ఉంది. ఆ మాట‌ల‌కు డీఎంకే ఏదో కౌంట‌రిచ్చింది.ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇప్పుడు పీకేను ల‌క్ష్యంగా చేసుకుని అన్నాడీఎంకే స్పందిస్తున్న తీరును గ‌మ‌నిస్తే.. గ‌తంలో ఏపీ ఎన్నిక‌ల ముందు టీడీపీ వాళ్లు అదే పీకే విష‌యంలో స్పందించిన తీరు గుర్తుకు వ‌స్తుంది. అప్ప‌ట్లో పీకేను తూర్పార‌ప‌ట్టింది టీడీపీ.బిహార్ గ్యాంగ్ అంటూ ప్ర‌శాంత్ కిషోర్ ను అభివ‌ర్ణించింది. జ‌గ‌న్ బిహార్ గ్యాంగ్ ను తెచ్చి ప‌ని చేయించుకుంటున్నాడంటూ ఎద్దేవా చేసింది. ఆ పంచ్ డైలాగుల మాటెలా ఉన్నా ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ చిత్త‌య్యింది. ఇప్పుడు అదే బిహార్ కు చెందిన వ్యూహ‌క‌ర్త ఒక‌రిని నియ‌మించుకుని టీడీపీ ప‌ని చేస్తూ ఉండ‌టం ఆ పార్టీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్ ను కూడా చాటుతోంది. త‌మ చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు టీడీపీ ఎలా స్పందించిందో ఇప్పుడు అన్నాడీఎంకే కూడా అలానే స్పందిస్తూ ఉంది పీకే విష‌యంలో. మ‌రి అన్నాడీఎంకేకు అక్క‌డ ఎలాంటి ఫ‌లితాలు ఎదుర‌వుతాయో!