ఇంత భయమా?

రాజకీయ నాయకులు చాలా సందర్భాల్లో నోరు జారీ ఏవేవో మాట్లాడుతుంటారు. ఆ తరువాత తాము చేసిన ప్రకటనతో రాజకీయంగా నష్టం జరుగుతుందని అనుకుంటే యూటర్న్  తీసుకుంటారు. ఓ మాట అనే ముందు, ప్రకటన చేసేముందు వెనుకా ముందు ఆలోచించాలి. రాజకీయాల్లో తొందరపాటు పనికిరాదు. కాలు జారితే తీసుకోగలం కానీ, నోరు జారితే తీసుకోలేం అనే సామెత నాయకులకు గుర్తుండదు. తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పని ఇలాగే ఉంది. బీజేపీ నాయకులు ఈయన మీద ఆశలు పెట్టుకుంటే ఈయనేమో భయపడిపోయి తుస్సుమనిపించాడు. ఈయన భయం వెనుక ఉన్న కథ ఏమిటో చూద్దాం. కొత్త ఏడాది మొదటిరోజే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సంగతి గుర్తుంది కదా. ఆయన అప్పుడేమన్నాడు? తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, తాను ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని బాంబు పేల్చాడు.కాంగ్రెస్ లో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనుకున్నాడు. రాజగోపాల్ రెడ్డి ప్రకటనతో బిజెపి నాయకులు హ్యాపీగా ఫీలయ్యారు. బీజేపీలోకి వెళతానని తురుంఖాన్ మాదిరిగా చెప్పిన రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు భయం పట్టుకుంది. కాషాయ కండువా కప్పుకుంటే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. అదే జరిగితే పదవి పోతుంది. ఉప ఎన్నిక ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో గెలవకపోతే పదవి లేకుండా ఖాళీగా ఉండాల్సి వస్తుంది.ఉప ఎన్నిక తెచ్చుకునే సాహసం చేయనంటున్నాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తానని చెబుతున్నాడు. అంటే పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటే బీజేపీలోకి వెళడు. లేకపోతే వెళతాడు. పక్కా అవకాశవాదమన్న మాట. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దానికి అండగా నిలవాలిగాని దాని మానాన దాన్ని వదిలేసి వెళ్లిపోవడం ఇప్పటి రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోయింది.