కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు బుధవారం (ఈ నెల 9) వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయం ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఈ నెల; 19 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు...
ముంబైలో భారీ వర్షం
ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలను భారీ వాన ముంచెత్తుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. దీంతో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. మహారాష్ట్రను ఒకరోజు ముందే రుతుపవనాలు తాకాయి. రుతుపవనాల రాకతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరో ఐదు రోజుల పాటు ముంబైకి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో కొంకణ్ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. థానే, రాయ్‌గఢ్, పుణె, బీడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,90,89,069కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,219 మంది కోవిడ్ పేషెంట్లు మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,53,528 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో 1,62,664 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,75,04,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 12,31,415 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 23.90కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ అందించారు.
చిచ్చుపెట్టిన ఆస్తి వివాదం
ఓ కుటుంబంలో ఆస్తి వివాదం చిచ్చుపెట్టింది. తండ్రితో కలిసి ఓ కుమారుడు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలో చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. దండెంపల్లి గ్రామానికి చెందిన సుంకరబోయిన యాదమ్మ (55), ఆమె భర్త గంగయ్య, కుమారుడు యాదగిరి సోమవారం రాత్రి ఆస్తులు, అప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలో యాదమ్మ ‘అంతా నా ఇష్టం. నా సోదరుడు పొగాకు శ్రీను చెప్పినట్టే చేస్తా’నని చెప్పడంతో కోపోద్రిక్తులైన భర్త, కుమారుడు ఆమెతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో గంగయ్య, యాదగిరి కలిసి గొడ్డలితో యాదమ్మ తలపై వేటువేశారు. కొనఊపిరితో ఉన్న ఆమెను బంధువులు రాత్రి 11 గంటల సమయంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది.
ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా సచేంది ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది చనిపోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డుపై ఉన్న జేసీబీని ఢీకొంది. ఆ తీవ్రతకు ఆ జేసీబీ రోడ్డు పక్కన పడిపోగా, బస్సు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. బస్సులోనే ప్రయాణికులంతా ఇరుక్కుపోయి, తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 17 మంది చనిపోగా ఐదుగురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామన్నారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మృతి
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల విక్రమ్‌రెడ్డి(28) దుర్మణం పాలయ్యారు. ఏఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. విక్రమ్‌రెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం పనులకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తన ద్విచక్రం వాహనంపై బయటకు వెళ్లారు.తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల నుంచి వస్తున్న బానోతు గంగు ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో విక్రమ్‌రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వివరించారు. ఆయనకు తల్లిదండ్రులు మంజుల– సత్యంరెడ్డి ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం బలోపేతం కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు.
అకీరా ఎంట్రీ గురించి చెప్పే సమయం ఇది కాదు
నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే కొడుకు అకీరా, కూతురు ఆధ్యకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పుకప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటికే పరిమితమైన రేణూ.. ఆపదకాలంలో ప్రజలకు తోడుగా తనవంతు సాయం చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ ధైర్యాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నెటిజన్లు అకీరా ఎంట్రీ గురించి పదేపదే అడుగుతున్నారు. నెటిజన్ల పోరు భరించలేక.. సింపుల్‌గా ఒక పోస్ట్‌పెట్టి తప్పించుకున్నారు రేణూ దేశాయ్. అకీరా ఎంట్రీ గురించి చెప్పే సమయం ఇది కాదని, కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనని, కాకపోతే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని రేణు అన్నారు. దీంతో త్వరలోనే అకీరా ఎంట్రీ ఉంటుందిని అంతా భావిస్తున్నారు....
దయచేసి పుకార్లను నమ్మొద్దు
కరోనా సెకండ్ వేవ్‌తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. మరికొందరు మాత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ కోవలోనే కీర్తీ సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘గుడ్‌లక్ సఖి’ కూడా ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం స్పందించి, ‘‘మా సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తాం. దయచేసి పుకార్లను నమ్మొద్దు’’ అని స్పష్టం చేసింది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్యా వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది.
మరోసారి ప్రేమలో పడిందట
అల్లరి పిల్ల, అందాల తారా రష్మిక మందన్నా మరోసారి ప్రేమలో పడిందట. అది కూడా కేవలం మూడు మిల్లీ సెకన్లనే పడిపోయిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సాధారణంగా ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుందని తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ప్రేమలో పడ్డానని రష్మిక తన ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి ప్రేమలో పడింది మనుషులతో కాదు, తన లిటిల్ పెట్ జౌరాతో. ‘ఈ ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నాకు ఆనందాన్ని ఇచ్చిన నా లిటిల్ పెట్‌ను మీకు పరిచయం చేస్తున్నా’ అంటూ తన పెట్ డాగ్ ఫోటోస్‌ను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు రష్మిక మందన్న. ఆ ఫోటోలు సోషల్ మీడియాలొ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అల్లు అర్జున్ ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే...
భర్తను కాటికి పంపిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య, తన కొడుకు, ప్రియునితో కలిసి భర్తను కాటికి పంపింది. ఈ దారుణం బెళగావి జిల్లా చించోళి వద్ద వెలుగుచూసింది. హతుడు కుమార రాముఖోత (39). అతని భార్య గీతకు బాలేశ అనే వ్యక్తితో సంబంధం ఉండేది. ఇది మానుకోవాలని అనేకసార్లు భర్త హెచ్చరించినా పెడచెవిన పెట్టింది. చివరకు ప్రియుడు, కొడుకు సచిన్, మరో ఇద్దరితో కలిసి పథకం ప్రకారం గత నెల 27న భర్తకు మద్యం తాగించి బండరాయితో కొట్టిచంపి శవాన్ని ప్లాస్టిక్‌కవర్లో చుట్టి సమీపంలో కృష్ణా నదిలో పడేశారు. భర్తను ఎవరో దుండగులు చంపేశారని ఏడవసాగింది. కుడచి పోలీసుల విచారణలో బండారం బట్టబయలైంది. మంగళవారం మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు.