ఎప్పుడూ ఊహించనవి జరిగితే …ఏ ఊరో కాలిపోతాందని పల్లెల్లో సరదాగా అంటుంటారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర బడ్జెట్‌పై చేసిన ఘాటు విమర్శలు వింటుంటే …ఊరేదో కాలిపోతున్నదేమో అని సరదా మాటలు గుర్తొస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కనిపించడం లేదు. దీంతో కేంద్ర బడ్జెట్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత చెత్త బడ్జెట్ గతంలో ఎప్పుడూ లేదని విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ఎన్నికలు జరిగే (తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ) రాష్ట్రాలపై వరాలు కురిపించారని ఆయన మండిపడ్డారు.ఏపీకి ఆత్మనిర్భర్ కూడా కనపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ శ్రద్ధ ఏమాత్రం కనిపించలేదని విమర్శించారు. ఏపీ విభజన జరిగినప్పటి నుంచి విశాఖ, విజయవాడకు మెట్రో రైలు అడుగుతూనే ఉన్నాం… కానీ బడ్జెట్‌లో వాటి ప్రస్తావనే లేదన్నారు. తమ విజ్ఞప్తుల్ని ఏమాత్రం పట్టించుకోలేదని అసంతప్తి చెందారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో 26 జిల్లాలు చేయబోతున్నామని.. వాటికి కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలన్నారు. పోలవరం సవరించిన అంచనాలపై మాట్లాడలేదని, ఫ్రైవేట్ కారిడార్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని ఆయన చెప్పుకొచ్చారు. నేషనల్ వైరాలజీ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సహాయాన్ని పదివేలకు పెంచాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని, నిరుద్యోగ నిర్మూలన దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులు పెంచాలని కోరినట్లు తెలిపారు.కరోనా వ్యాక్సినేషన్‌కు రూ.35వేల కోట్లు కేటాయించారని,ఇదొక్కటే బడ్జెట్‌లో మంచి అంశమని విజయసాయిరెడ్డి తెలిపారు. అభివృద్ధి దిశ బడ్జెట్ కావాలి కానీ.. సర్వైవల్ బడ్జెట్ కాదని ఆయన తేల్చి చెప్పారు. వైసీపీ లోక్‌సభాపక్షనేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్ చాలా నిరుత్సాహ పరిచే విధంగా ఉందన్నారు. రెవెన్యూలోటు భర్తీకి కేంద్రం నిధులు ఇవ్వాలని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.
