కేంద్ర మంత్రి ప‌రిస్థితి విష‌మం…

పనాజీ: కర్ణాటకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌ (68) తీవ్రంగా గాయపడగా.. ఆయన భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్‌ మరణించారు. కర్ణాటకలోని ధర్మస్థల నుంచి గోవాకు తిరిగొస్తుండగా ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలాలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుప్రక్కనున్న చెట్టును కారు బలంగా ఢీకొన్నదని ఒక పోలీస్‌ అధికారి తెలిపారు. దవాఖానకు తరలించేలోపే మంత్రి భార్య మరణించారని, చికిత్స పొందుతూ పీఏ మృతిచెందాడని పేర్కొన్నారు. అపస్మారకస్థితిలో ఉన్న కేంద్రమంత్రిని అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు.  గోవా వైద్య కళాశాలలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారులో మొత్తం ఆరుగురు వ్య‌క్తులు ఉన్నారు. వీరిలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయ‌క్‌, ఆయ‌న భార్య విజ‌య కూడా ఉన్నారు. ఈ ప్ర‌మాదం సోమ‌వారం రాత్రి 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్య‌లో జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కేంద్ర మంత్రి త‌న భార్య‌తో క‌లిసి ఆదివారం ఉడుపిలోని శ్రీకృష్ణ మ‌ఠంను సంద‌ర్శించారు. శ‌నివారం ధ‌ర్మ‌స్థ‌ల‌లో ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.  కేంద్ర‌మంత్రి శ్రీపాద త్వ‌ర‌గా కోలుకోవాల‌ని క‌ర్ణాట‌క సీఎం బీఎస్ యెడియూర‌ప్ప ట్వీట్ చేశారు. శ్రీపాద భార్య మృతిప‌ట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. శ్రీపాద నాయ‌క్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు మంత్రులు, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు కోరుకున్నారు.