ఎన్నికలు ఎలా గెలవాలో తెలిశాకా… ఇక సామాన్యుడి కోసం పాలించాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి ఉంటుంది? తమకు తిరుగులేదు అనే లెక్కలతో కొంతమంది పాలకులు ప్రజలను పీల్చిపిప్పి చేయడాన్ని పాలనే అనుకుంటూ ఉంటారు.పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఇప్పటికే ఏ మాత్రం మొహమాటం లేకుండా బాదుతున్న మోడీ ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా పెట్రోల్, డీజిల్ పై కొత్త సెస్ తీసుకొచ్చింది. వ్యవసాయ సెస్సు అట!మొదట్లో స్వచ్ఛ భారత సెస్ అయ్యింది, ఇప్పుడు వ్యవసాయ సెస్! అయితే ఈ వ్యవసాయ సెస్ వల్ల ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవట. అయితే ఒక్కసారి సెస్ అంటూ వేసిన తర్వాత.. దాని ఫలితంగా ధరలు పెరగడమే కానీ, తగ్గే ప్రసక్తి ఉండదు. గిల్లి జోల పాడినట్టుగా.. సెస్ వేసి, ప్రస్తుతానికి ధరలు పెరగవంటూ ఊరడిస్తున్నారు!బడ్జెట్ ఎందుకు? అంటే.. బాదేందుకు! అనే తమ తీరును యథాతథంగా కొనసాగిస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. తొలిసారి గద్దెనెక్కినప్పటి నుంచి ఇదే తీరు కొనసాగుతూ ఉండటం గమనార్హం.ఇక ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు మరో దివాళాకోరు రాజకీయం కాక మరేమిటి? త‌్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళలకు అభివృద్ధి కోసమంటూ భారీగా కేటాయింపులు చేసి.. దేశ బడ్జెట్ ను ఎన్నికలకు పంచే తాయిళాల స్థాయికి తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతూ ఉంది! ఎన్నికలు ఎలా గెలవాలో తెలిసిపోతే పాలకులకు ఇంతకన్నా చేయాల్సిన పనేమైనా ఉంటుందా?
