బంగ్లా సరిహద్దులో సొరంగ మార్గం

గౌహతి: బంగ్లాదేశ్‌ సరిహద్దులో రహస్య సొరంగ మార్గం బయటపడింది. ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్‌ గురించి అందిన ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా దీని గురించి తెలిసింది. అసోంలోని కరీమ్‌గంజ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్‌ చేశారని, వీరిద్దరు బంగ్లాదేశ్‌లో ఉన్నట్లుగా తెలిసిందని డిసెంబర్‌ 28న నీలం బజార్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసుపై దర్యాప్తులో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దు ఫెన్సింగ్‌ కింద ఉన్న 200 మీటర్ల పొడవైన భూగర్భ నిర్మాణ మార్గాన్ని పోలీసులు గుర్తించారు. అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌ కోసం దీనిని వినియోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పశువుల స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్‌ చేసి దీని గురించి ప్రశ్నిస్తున్నట్లు కరీమ్‌గంజ్‌ ఎస్పీ మయాంక్ కుమార్ తెలిపారు.మరోవైపు పోలీసుల ఆరోపణలను బీఎస్‌ఎఫ్‌ అధికారులు ఖండించారు. అది సొరంగ మార్గం కాదని, నీటి పారుదల కోసం వేసిన పైప్‌లైన్‌ అని తెలిపారు. భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య అంతర్జాతీయ సరిహద్దు రహదారి, ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయకముందు ఇరు దేశాల మధ్య నీటి పారుదల కోసం ఈ పైప్‌లైన్‌ వేశారని చెప్పారు. కిడ్నాప్‌ అయినట్లుగా చెబుతున్న ఇద్దరు వ్యక్తులు తమకు తాముగానే బంగ్లాదేశ్‌కు వెళ్లినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. పశువుల స్మగ్లింగ్‌ కోసం డబ్బులు తీసుకుని ఆ పని చేయని వారిద్దరిని బంగ్లాదేశ్‌లోని వారు నిర్బంధించినట్లుగా చెప్పారు. బీఎస్‌ఎఫ్‌కు ఈ విషయం తెలియడంతో తమ వారు కిడ్నాప్‌ అయినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు.