హెల్మెట్ పెట్టుకోలేదని ట్రక్ డ్రైవర్‌కు ఫైన్‌

భువనేశ్వర్‌: అవును మీరు చదివింది కరక్టే. మన పొరుగునే ఉన్న ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగిందీ విచిత్రం. డ్రైవింగ్‌ చేసేటప్పుడు హెల్మెట్‌ ధరించలేదని ఓ ట్రక్కు డ్రైవర్‌కు రూ.వెయ్యి జరిమానా విధించారు ట్రాఫిక్‌ పోలీసులు. ప్రమోద్‌ కుమార్‌ స్వైన్‌ అనే వ్యక్తి వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లైసెన్స్‌ పర్మిట్‌ ముగియడంతో రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌ (ఆర్టీవో)కు వెళ్లాడు. దీంతో అధికారులు అతని పేరుతో ఉన్న చలానాను చూపించారు. అందులో ‘హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినందుకు’ రూ.1000 ఫైన్‌ విధించామని ఉంది. దీంతో ఆశ్చర్యపోవడం అతని వంతయ్యింది.

‘నేను గత మూడేండ్లుగా వాటర్‌ ట్యాంకర్‌ నడుపుతున్నాను. నా ట్రక్కు నంబర్‌తో హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినందుకు ఫైన్‌ విధించామని చలానాలో పేర్కొన్నారు. అసలు ట్రక్కు నడపడానికి హెల్‌మెట్‌ ఎందుకు. ప్రజలనుంచి ఎలాగైనా పైసలు వసూలు చేయాలని అధికారులు చూస్తున్నారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకోవాలి’  అని ప్రమోద్‌ కుమార్‌ అన్నారు. ఫైన్‌ కట్టిన తర్వాతే అతని పర్మిట్‌ను రెన్యువల్‌ చేయడం ఇక్కడ కొసమెరుపు.