ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు ఉత్త‌రాఖండ్ సీఎంగా తీర‌త్ సింగ్ రావ‌త్‌ ప్రమాణం

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్ కొత్త సీఎంగా తీర‌త్ సింగ్ రావ‌త్ ఎంపిక‌‌య్యారు.  ఆయ‌న ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.  సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న త్రివేంద్ర సింగ్ రావ‌త్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  ఇవాళ డెహ్రాడూన్‌లోని బీజేపీ పార్టీ ఆఫీసులో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  లెజిస్లేచ‌ర్ మీటింగ్‌లో ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ పాల‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. కొత్త సీఎం తీర‌త్ సింగ్ వ‌య‌సు 56 ఏళ్లు. ఆయ‌న బీజేపీ ఎంపీ.  ఉత్త‌రాఖండ్‌లో 2013 నుంచి 2015 వ‌ర‌కు ఆయ‌న ఉత్త‌రాఖండ్ పార్టీ చీఫ్‌గా చేశారు. గ‌తంలో ఎమ్మెల్యేగా చేశారు.  కేంద్ర మంత్రి ర‌మేశ్ పోక్రియాల్ నిషాంక్‌, మంత్రి ధాన్ సింగ్ రావ‌త్ .. కొత్త సీఎంను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

త్రివేంద్ర రాజీనామా..

ముఖ్యమంత్రిగా మరో పది రోజుల్లో నాలుగేండ్లు పూర్తి చేసుకోనున్న త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బేబీ రాణి మౌర్యకు రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌.. తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునేంత వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని రావత్‌ను కోరారు. సీఎం రావత్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తమను పరిగణనలోకి తీసుకోవట్లేదని, అధికారులు కూడా తమ మాట వినట్లేదని వారు విమర్శిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రావత్‌ సారథ్యంలో బరిలోకి దిగితే పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని వారు హైకమాండ్‌కు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో  కేంద్ర నాయకత్వం శనివారం పార్టీ సీనియర్‌ నేతలను రాష్ట్రానికి పరిశీలకులుగా పంపింది. ముఖ్యనేతలతో భేటీ అయిన వారు.. నాయకత్వ మార్పుపై అధిష్టానానికి నివేదికిచ్చారు.