న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సర్వీసులపై సస్పెన్షన్‌ను రేపు రాత్రి 11 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, ఘాజీపూర్, టిక్రిల్లో సస్పెన్షన్ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలల నుంచి ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీసులపై సస్పెన్షన్ విధించింది.
