డీఎంకే గెలిస్తే ఇసుక మైనింగ్‌కు అనుమతి!

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు రాజకీయ పార్టీలు అలవిమాలిన వాగ్ధానాలను గుప్పిస్తుంటే తాజాగా డీఎంకే అభ్యర్థి ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కరూర్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన డీఎంకే అభ్యర్థి సెంథిల్‌ బాలాజీ తమ పార్టీ అధికారంలోకి రాగానే ఇసుక మైనింగ్‌కు అనుమతిస్తామని అధికారులు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే వారిని తొలగిస్తామని చెప్పారు. స్టాలిన్‌ సీఎం కాగానే మీరంతా ఎడ్లబండ్లతో నదికి వచ్చి ఇసుకను తోలుకుపోవచ్చని అధికారులు మిమ్మల్ని అడ్డుకోరని, ఎవరైనా అడ్డగిస్తే తనకు సమాచారం అందిస్తే వారిపై వేటు వేస్తామని బాలాజీ ప్రజలకు హామీ ఇచ్చారు.

తాము అధికారం చేపడితే పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్‌ ధరలను తగ్గిస్తామని మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించింది. విద్యార్ధులకు డేటా కార్డుతో ఉచితంగా కంప్యూటర్‌ ట్యాబ్‌లు అందిస్తామని, నీట్‌ పరీక్షను రద్దు చేస్తామని హామీలు గుప్పించింది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాలక ఏఐఏడీఎంకేతో బీజేపీ జట్టుకట్టగా, కాంగ్రెస్‌తో కలిసి డీఎంకే ఎన్నికల పొత్తుతో ముందుకువెళుతోంది.