ముంబై: పాతతరం నటుడు, ప్రముఖ గుజరాతీ నటుడు శర్మాన్ జోషి తండ్రి అరవింద్ జోషి (84) ఇకలేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో వారం రోజుల క్రితం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న జోషి ఈ ఉదయం కన్నుమూశారు. అరవింద్ జోషి మరదలు సరితా జోషి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అరవింద్ జోషికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అరవింద్ జోషి కుమారులు శర్మాన్ జోషి, మాన్సి జోషి ఇద్దరూ నటులే. కాగా, అరవింద్ జోషి హిందీలో షోలే, లవ్ మ్యారేజ్, నామ్ తదితర చిత్రాలతోపాటు, గుజరాతీలో గర్వో గరాసియో, ఘెర్ ఘెర్ మతినా చులా తదితర చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి పలువురు బాలీవుడ్, గుజరాతీ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
