బెంగళూరు : తనపై విష ప్రయోగం జరిగిందని ఇస్రో శాస్ర్తవేత్త తపన్ మిశ్రా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2017, మే 23వ తేదీన విషపూరితమైన ఆర్సెనిక్ ట్రై ఆక్సైడ్‌ను ప్రయోగించారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల చివర్లో మిశ్రా పదవీ విరమణ సందర్భంగా ఆయనను ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేయగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్సెనిక్ ట్రై ఆక్సైడ్‌ను దోశ చట్నీలో కలిపి ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ శాస్ర్తవేత్తకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. చర్మంపై దద్దుర్లు ఏర్పడటం, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ రావడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాను. ఆ తర్వాత వారు పరీక్షలు నిర్వహించగా తనపై విష ప్రయోగం జరిగినట్లు నిర్ధారణ అయింది. ఆర్సెనిక్ ట్రై ఆక్సైడ్‌ను చట్నీలో కలిపి ఇచ్చి చంపాలనుకున్నారని మిశ్రా పేర్కొన్నారు. గుర్తింపు ఉన్న ఓ శాస్ర్తవేత్తను చంపాలనుకోవడం దారుణం. దీనిపై భారత ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతున్నానని మిశ్రా తెలిపారు. అయితే మిశ్రా చేసిన వ్యాఖ్యలపై ఇస్రో ఇంత వరకు స్పందించలేదు. ప్రస్తుతం మిశ్రా ఇస్రోలో సీనియర్ సలహాదారుగా పని చేస్తున్నారు. అంతకుముందు అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.